
కేంద్రం అన్యాయం చేసింది
పక్కా ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఎంపీ కవిత దుయ్యబట్టారు.
తెలంగాణకు 10 వేల ఇళ్లు.. ఏపీకి 1.93 లక్షలా?
ఇదేం న్యాయం: ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: పక్కా ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఎంపీ కవిత దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కి 1.93 లక్షల ఇళ్లను మంజూరు చేసి తెలంగాణకు కేవలం 10 వేల ఇళ్లను కేటాయించడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నిం చారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.8 వేల కోట్ల నిధులు కేటాయించి తెలంగాణకు మొండిచేయి చూపించిందన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన విషయంలో కూడా జాప్యం చేస్తోందన్నారు. కేంద్రం ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు 400 ఇళ్ల చొప్పున కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి 400 ఇళ్లతోపాటు అదనంగా 1,100 ఇళ్లను మంజూరు చేసిందన్నారు.
అందుకు నియోజక వర్గ ప్రజల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ‘‘నిజామాబాద్ లో నిరుపేదలు, మైనారిటీలు, బీడీ కార్మికులు అధికంగా ఉన్నారు కాబట్టి అదనంగా ఇళ్ల నిర్మాణ అవసరం ఉందని గుర్తించారు. 72 ఎకరాల్లో 1,500 ఇళ్లను ఒకేచోట నిర్మించి అతి పెద్ద కాలనీగా చేస్తాం’’ అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ పట్టణం భ్రష్టుపట్టిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంతి డెరైక్షన్‌లో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు.
అసత్యాల ‘జ్యోతి’
సమావేశంలో ఒక విలేకరి ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించగా కవిత ఘాటుగా స్పందించారు. ‘‘ఎన్నికల ప్రచార ఖర్చుకి సంబంధించిన మాకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ వార్త ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అది అబద్ధాల జ్యోతి, అసత్యాల జ్యోతి. ఇప్పటివరకూ మా ఇంటికి ఎలాంటి నోటీసులు రాలేదు. ఒకవేళ మా అడ్రస్‌తో ఆంధ్రజ్యోతికి కార్యాలయానికి ఏమైనా నోటీసులు అందాయేమో నాకు తెలీదు. ఒకవేళ అలాంటి విషయాలేమైనా ఉంటే ఎన్నికల కమిషన్ మాకు నోటీసులిస్తే లీగల్‌గా ఎలా స్పందించాలో అలా స్పందిస్తాం..’’ అని చెప్పారు.