ఆప్షన్ల పేరిట కుట్ర...
హైకోర్టు విభజనపై కేంద్రం మొండివైఖరి: ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కోర్టులను మరో ముప్పై ఏళ్లపాటు తన గుప్పిట పెట్టుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. హైకోర్టు విభజన జరగకుండా మోకాలడ్డుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా విభజన విషయంలో మొండివైఖరి అవలంబిస్తోందని అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో హైకోర్టును విభజించాలని సీనియర్ జడ్జీల నుంచి సాధారణ లాయర్ల దాకా సమ్మె చేస్తున్నారని, రెండేళ్లు పూర్తయినా తెలంగాణకు సంబంధించి విభజన పూర్తి కాలేదన్నారు.
తెలంగాణలో 339 మంది జడ్జీలుంటే, వారిలో 98 మంది ఏపీ వారేనని, వీరు కాకుండా జిల్లా స్థాయిలో, మేజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న వారూ ఉన్నారన్నారు. ఆప్షన్స్ పేరిట కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఏపీలో 100 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా, ఇక్కడ ఆప్షన్లు పెట్టిస్తున్నారన్నారు. ప్రతీ అంశంలో కేంద్రం వ్యవహారం మనోవేదనకు గురిచేసేలా ఉందన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి జడ్జీల వరకూ ఈ వివక్ష ఉందన్నారు. రాజకీయ నేతలు పార్టీలకతీతంగా ఒక్కటి కావాలని, కేంద్రంపై పోరాడుదామని పిలుపు ఇచ్చారు. మల్లన్నసాగర్ దగ్గర దొంగ దీక్షలు కాకుండా, హైకోర్టు విభజన కోసం దీక్షలు చేయాలన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, కేంద్ర మంత్రి దత్తాత్రేయలు కూడా కలసి రావాలని, హైకోర్టు దగ్గర దీక్ష చేద్దామని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు గురై కేంద్రం ఇలా చేస్తోందని, సీఎం కేసీఆర్ మనోవేదన నిజమేనని, జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, ఒక ప్రధానిపై ఒక రాష్ట్ర సీఎం దీక్ష చేయడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని, ఆ పరిస్థితుల్లోకి తమను నెట్టవద్దన్నారు.