
'వంద కేసులు పెట్టినా భయపడం'
నెల్లూరు: ప్రజల తరపున పోరాటం చేస్తున్నందుకు తమపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోపించారు. తమపై వంద కేసులు పెట్టినా భయపడేదిలేదని చెప్పారు. శుక్రవారం నెల్లూరులో పార్టీ నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజా ప్రతినిధులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. అధికారం ఉందని చంద్రబాబు ప్రభుత్వం విర్రవీగుతోందని మండిపడ్డారు. ప్రజల తరపున వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు మహిళా తహశీల్దార్ను జట్టు పట్టుకునికొడితే అడిగే పరిస్థితి లేదని వనజాక్షిపై దాడి ఘటనను ప్రస్తావించారు. తాను తప్పుచేసినట్టు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను ఈ నెల 17న పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. బుధవారం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా, గురువారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.