మృత్యు పంజా
మృత్యు పంజా
Published Thu, Dec 15 2016 1:42 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
జిల్లాలో మృత్యువు పంజా విసిరింది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురిని బలితీసుకుంది. 12 మందిని క్షతగాత్రులను చేసింది.
రెండు మోటారుసైకిళ్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం
ఉండి : మండలంలోని కోలమూరులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గణపవరానికి చెందిన కసిలంకి బాలాజీ, అతని భార్య భాగ్యలక్ష్మి ద్విచక్రవాహనంపై భీమవరం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో గణపవరం మండలం అర్థవరం గ్రామానికి చెందిన కట్లయ్య ఉండిలో తను పనిచేస్తున్న చేపల చెరువు వద్దకు వెళ్తున్నాడు. కోలమూరు రైస్‌మిల్లు వద్దకు వచ్చేసరికి బాలాజీ కంటైనర్ అడ్డం రావడంతో దానిని ఓవర్‌టేక్ చేసి ముందుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన కట్లయ్య వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కట్లయ్య వెంటనే మరణించాడు. భాగ్యలక్ష్మి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. 108 రావడం ఆలస్యం కావడంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృదేహాలను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు.
పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తా .. డ్రైవర్ మృతి
తూర్పుపాలెం (ఆచంట) : ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బుధవారం అదుపు తప్పి చేలల్లో బోల్తా పడింది. తూర్పుపాలెం సమీపంలోని నక్కల కాలువ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ట్రాక్టరు డ్రైవర్ మృతి చెందాడు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆచంట మండలం కొడమంచిలి పెదపేటకు చెందిన 30 మంది గ్రామానికి చెందిన ముప్పిరి రామారావు కుమార్తె వివాహం నిమిత్తం బుధవారం ట్రాక్టరుపై పోడూరు మండలం పండిత విల్లూరుకు వెళ్లారు. అక్కడ వివాహ అనంతరం అదే ట్రాక్టరుపై తిరుగుపయనమయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు తూర్పుపాలెం దాటిన తర్వాత నక్కల కాలువ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న చేలల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టరు డ్రైవర్ గొల్ల సందీప్(19) మృతి చెందాడు. సల్లపూడి మంగ, దేవాబత్తుల సరోజిని, ఊడి కళాపూర్ణ, నక్కా సురేష్, కంబొత్తుల రాజ్‌కుమార్, ప్రదీప్, కోట శేఖర్, కాకర ప్రసన్నకుమార్, ఉండ్రు రాజేష్‌తోపాటు మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఇంజనుకు ట్రాక్టరుకు ఉన్న లింకు రాడ్డు విరిగి పోవడంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రక్కు బోల్తా పడకుండా నిలిచిపోవడంతో ట్రక్కులో కూర్చున్న వారికి పెనుప్రమాదం తప్పింది. స్థానికులు, ప్రయాణికులు స్పందించి గాయపడిన వారిని రక్షించి ఆచంటలోని సీహెచ్‌సీకి తరలించించారు. వైద్యాధికారులు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యసేవల నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతిగా మద్యం తాగడం వల్లే ప్రమాదం
ప్రమాదంలో మృతిచెందిన సందీప్ అవివాహితుడు. అతిగా మద్యం తాగి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పెనుగొండ మండలం తాళ్లపాలెంకు చెందిన సత్యనారాయణ, మంగ దంపతులకు సందీప్‌తోపాటు, ఇద్దరు కుమార్తెలు. చెట్టంత కొడుకు దూరమైపోవడంతో ఆ కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. బాధితులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సుంకర సీతారామ్, సర్పంచ్ చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ పరామర్శించారు.
లారీ ఢీకొని మహిళ..
విజయరాయి(పెదవేగి రూరల్) : భార్యాభర్తలు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా.. లారీ ఢీకొని భార్య అక్కడిక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన విజయరాయి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరులోని కుమ్మరచెరువు ప్రాంతానికి చెందిన చమళ్లమూడి శ్రీనా«థ్, సుజాత(40) దంపతులు బుధవారం రాత్రి చింతలపూడికి పనిమీద వెళ్లి తిరిగి ఏలూరు వస్తుండగా, పెదవేగి మండలం విజయరాయిలో కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మలుపులో ఏలూరు నుంచి ఎదురుగా వస్తున్న లారీ మోటార్‌సైకిల్‌ను ఢీకొంది. దీంతో సుజాత లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శ్రీనాథ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భార్య మృతదేహం వద్ద ఆయన విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
ట్రక్కు ఆటో ఢీకొని..
గుండుగొలను (దెందులూరు) : జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుండుగొలను వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మెకానిక్ మృతి చెందాడు. దెందులూరు ఎస్సై ఎ¯ŒS.ఆర్.కిశోర్‌బాబు కథనం ప్రకారం.. గంపల దుర్గాప్రసాద్ (55) విజయవాడలో పొక్లెయి¯ŒS, లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం పోలవరం వెళ్లి మరో వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో మంగళవారం రాత్రి టీ కోసం జంక్ష¯ŒS వద్ద ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగారు. ఆ సమయంలో మరోవ్యక్తి బహిర్భూమికి వెళ్ళాడు. అక్కడే నిలబడి ఉన్న దుర్గాప్రసాద్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఆటో ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దుర్గాప్రసాద్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
Advertisement
Advertisement