తెలుగువారి సత్తాచాటిన ఎమ్మెస్కే
మంగళగిరి: క్రికెట్‌లో తెలుగువారి సత్తాచాటిన ఘనత ఎమ్మెస్కే ప్రసాద్ దక్కించుకున్నారని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన ప్రసాద్‌ను నవులూరు అమరావతి క్రికెట్ స్టేడియంలో గురువారం రాత్రి సన్మానించారు. ముఖ్య అతిథి గంగరాజు మాట్లాడుతూ.. అమరావతి క్రికెట్ స్టేడియం కోచ్‌గా క్రికెట్‌లో ఎంతోమంది యువకులను వెలుగులోకి తీసుకువచ్చిన ఎమ్మెస్కే భారత క్రికెట్ జట్టుకూ మంచి ఆటగాళ్లను ఎంపికచేసి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన స్ఫూర్తితో యువకులు రాణించి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో అమరావతి క్రికెట్ స్టేడియం అభివృద్ధికి ఎమ్మెస్కే సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో స్టేడియం కన్వీనర్ కోకా రమేష్, జనరల్ మేనేజర్ సూరజ్, హెడ్ కోచ్ కృష్ణారావు, కోశాధికారి రహీం ఎమ్మెస్కేను అభినందించారు.