ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వైఎస్‌ఆర్ భిక్షే
– అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
– సిద్ధేశ్వరం ప్రాజెక్టుతోనే సీమ సస్యశ్యామలం
– బైరెడ్డి రాజశేఖరరెడ్డి
నందికొట్కూరు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భిక్షేనని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో మాజీ సర్పంచు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో టీడీపీ నుంచి ఆర్‌పీఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైరెడ్డి మాట్లాడారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి పునాదులు వేసి నిధులు కేటాయించింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనన్నారు. ఆ పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చే రోజే దీక్షకు దిగుతామన్నారు. కర్ణాటక జల దోపిడీని ఎలా అరికడతారో సమాధానం చెప్పాలన్నారు. అప్పట్లో పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి నీరు అందిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అంటున్నాడని ఏది నిజమో ప్రజలే ఆలోచించాలన్నారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే నిఖర జలాలతో రాయలసీమంతా సాగునీరు వచ్చి అభివృద్ధి చెందుతుందని కర్ణాటక జలచౌర్యం అరికట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ముందడగు వేయడంలేదని ప్రశ్నించారు. హొస్పేట్ డ్యాం నుంచి కేసీ కెనాల్‌కు రావాల్సిన వాటాకు ఉన్న హక్కులను భంగం కలిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రభుత్వం ప్రకటించి రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కోస్తాపై ప్రేమ ఒలకబోస్తూ సీమపై కక్ష సాధింపునకు పాల్పడడం దారుణమన్నారు.