రాష్ట్రం చంద్రబాబు జాగీరా?
రాష్ట్రం చంద్రబాబు జాగీరా?
Published Fri, Aug 4 2017 11:41 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
- నేను పాదయాత్ర చేస్తే తప్పా?
– చంద్రబాబు చేస్తే కల్చరా?
– గతంలో పోలీసు కుటుంబాలు కూడా రోడ్డెక్కాయి
– ఒక ఐజీ పళ్లు రాలగొట్టిన ఘటనలున్నాయి
– మా జాతి ఆకలి కోసం, సమస్యల కోసం పాదయాత్రలు చేయకూడదా?
– మీకో చట్టం.. మా జాతికో చట్టమా ?
– నేనేమీ చంద్రబాబు ఆస్తులు దోచుకోడానికి వెళ్లడం లేదు
- పాదయాత్రను అడ్డుకున్న ఐజీని ప్రశ్నించిన ముద్రగడ
కిర్లంపూడి/ప్రత్తిపాడు (జగ్గంపేట) : రాష్ట్రం ఏమైనా చంద్రబాబు జాగీరా? నేనేమీ వారి హెరిటేజ్‌లో ఆస్తులను దోచుకోవడానికి వెళ్లడం లేదే.. వారి కోట్లాది రూపాయలతో కట్టించిన ఇంటిలో బంగారం, డబ్బూ దోచుకోవడానికి వెళ్లడం లేదే. మాజాతి, మా ఆకలి సమస్యలను చెప్పుకోవడం కోసం, చంద్రబాబు ఇచ్చిన హామీనే గుర్తు చేయడం కోసం పాదయాత్ర చేస్తానంటే ఇన్ని అడ్డంకులు కల్పించడం ఎంతవరకు సమంజసం’’ అంటూ కాపు
పు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో నిరవధిక పాదయాత్రకు తన ఇంటి నుంచి ఆయన బయలుదేరగా ఇంటి గేటు వద్ద ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి భారీ ఎత్తున పోలీసులు మోహరించి ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ ఓఎస్‌డీపై ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టాలు అందిరికీ ఒక్కటేనన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో ఎవరి అనుమతి తీసుకుని పాదయాత్ర చేశారు? వారికి చట్టాలు వర్తించవా? మీ పోలీసుల సమస్య వచ్చినపుడు మీ పోలీసు కుటుంబాలు రోడ్డెక్క లేదా? అని ప్రశ్నించారు. బెటాలియన్‌లో ఓ ఐజీ ఉన్నప్పుడు పోలీసు కుటుంబాలే బీభత్సం సృష్టించారే.. మా భర్తలు మాతో కాపురం చేయకూడదా? మీ భార్యలతో మీరుంటారా? అంటూ తిరగబడి ఓ ఐజీని పళ్లు ఊడగొట్టిన సందర్భాన్ని ముద్రగడ గుర్తు చేశారు. సమస్య వచ్చినపుడు మీ పోలీసు కుటుంబాలు రోడ్డు మీదకు రా లేదా? ఆరోజు కూడా పోలీసు కుటుంబాలు అనుమతి తీసుకునే ఆందోళన చేశారా? అని పోలీసులను ముద్రగడ నిలదీశారు. 2009 సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు. 2014లో చంద్రబాబు ఏ గైడ్‌లైన్స్ ప్రకారం పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రకు ఏ విధంగా గైడ్‌లైన్స్ ఫాలో అయ్యారో, ఆనాటి అనుమతి లెటరు మాకు తెలియజేస్తే ఆ రకంగా తాము అనుమతి కోరతాం అన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తే కల్చర్ అంటున్నారు, మేము చేస్తే వ్యభిచారమంటున్నారు. హైవే ఎక్కకూడదంటున్నారు. హైవేపై బెంజి సర్కిల్‌లో మీటింగులు పెట్టి రోజుల తరబడి ట్రాఫిక్ నిలుపుదల చేస్తున్నారే.. అవనిగడ్డ మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారే.. అధికారం ఉందని చంద్రబాబు ఈ విధంగా చేయవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. మీరు తిరిగి వెనక్కి వెళ్లిపోండని పోలీసులు చెప్పడంతో కొడితే కొట్టించేయండి, కాల్చితే కాల్పించేయండి, నా ఇంట్లో కూడా నిలబడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అన్నారు. నాకు ఎవరూ లేరు, నేను అనాథను. పాదయాత్రకు వదిలేయవచ్చుకదా. మీరే రికమండేషన్ చేయ్యవచ్చుకదా అన్నారు. నావెనక ఎవరూ లేనప్పుడు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీశారు.
చంద్రబాబు హైవేలో మీటింగులు పెట్టడానికి రూల్స్ ఒప్పుకుంటాయి
కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు జైత్రయాత్రలు, పాదయాత్రలు, ఉత్సాహ యాత్రలు చేసుకోవచ్చు, కానీ మా కేమో సెక‌్షన్ 30, 144. చట్టాలన్నీ చంద్రబాబు నాయుడికి చుట్టాలవుతున్నాయి. మాకేమో కేసులా? ఏమిటి సారు ఈ పరిపాలనా అంటూ జేఏసీ నాయకులు ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డిని ప్రశ్నించారు. అనంతరం అనుమతి వచ్చేంతవరకు రోజుకు ఒకసారి వస్తాను అని పోలీసులతో చెప్పి ముద్రగడ వెనుతిరిగారు.
దరువుతో నిరసన
ముద్రగడ నివాస ఆవరణలో జేఏసీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాపు సామాజిక వర్గీయులతో కలిసి మధ్యాహ్నం కంచంపై దరువు వేస్తూ ప్రధాన గేటు వరకు వచ్చారు. ముద్రగడ పాదయాత్రకు పోతున్నారేమోనని పోలీసులు కంగారు పడి గేటువద్దకు ఉరుకులు పరుగులతో చేరుకున్నారు. కానీ ముద్రగడ గేటు వద్ద కొంచెం సేపు దరువు వేసి, అనుచరులతో వెనుతిరిగారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, తుమ్మలపల్లి రమేష్, చెక్కపల్లి సత్తిబాబు, జగపతినగరం గ్రామ సర్పంచ్ పెంటకోట నాగబాబు, ధర్మవరం సొసైటీ అధ్యక్షుడు జువ్వల చినబాబు, సానా నూకరాజు నాయుడు, సిద్దా అప్పలరాజు, రామకుర్తి వెంకటరాజా, వేలంక మాజీ సర్పంచ్ నీలగిరి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
కిటకిట లాడిన ముద్రగడ నివాసం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో వివిధ గ్రామాల ప్రజలు ముద్రగడ ఇంటికి క్యూ కడుతున్నారు. శుక్రవారం కిర్లంపూడి పరిసర గ్రామాలైన ప్రత్తిపాడు, ధర్మవరం, చెందుర్తి, చేబ్రోలు, ఒమ్మంగి, తాటిపర్తి, వేలంక, సింహాద్రిపురం, పిఠాపురం తదితర గ్రామాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి కాపు సామాజిక వర్గీయులు భారీ ఎత్తున కిర్లంపూడి చేరుకుని, ముద్రగడకు మద్దతు తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన గండేపల్లి బాబి, ఉమ్మిడి శ్రీనివాసు, ఓరుగంటి గోపాలకృష్ణ, గుండే రమణ, బాలేపల్లి రాము, బొజ్జా సర్వారాయుడు, బొల్లు సీతారామరాజు, కొండెపూడి శంకరరావు, మాకవరపు అయ్యన్న తదితరులు ముద్రగడకు మద్దతు తెలిపారు.
Advertisement
Advertisement