
చికిత్సకు ససేమిరా అన్న ముద్రగడ
తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా బనాయిస్తున్న కేసులను ఉపసంహరించాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయించుకోడానికి ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలోని 202 రూమ్‌లో ఆయనను ఉంచారు. వైద్యులు అనేకసార్లు ఆయనకు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. నిన్న సాయంత్రం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. పరిస్థితి ఏంటన్నది బయటకు తెలియనివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. పేషెంట్లు, అధికారులు మినహా ఎవరినీ ఆస్పత్రిలోకి రానివ్వడం లేదు. తన డిమాండ్ నెరవేర్చేవరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు.
మరోవైపు ముద్రగడ అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లాలో 124 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మడివరం.. ఇలా పలు ప్రాంతాల్లో కులసంఘాల నాయకులను కూడా ముందస్తు అరెస్టు చేశారు. మరికొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. అమలాపురంలో బంద్‌ను విఫలం చేయడానికి బలవంతంగా దుకాణాలు తెరిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు.