ముద్రగడ దీక్షకు ఎన్ఆర్ఐల మద్దతు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఎన్ఆర్ఐలు మద్దతు తెలియజేశారు. అమెరికాలోని నార్త్ వర్జీనియాలోని కాపు ఎన్ఆర్ఐలు ముద్రగడ దీక్షకు మద్దతుగా శౌరి ప్రసాద్, వేణు పులిగుజ్జు నాయకత్వం లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయ్ గుడిసేవ, వెంకట్ చలమలశెట్టి , రవి ముళ్ళపూడి, నృపేంద్ర, పూర్ణ, జనార్దన్, రాజేష్ అంకం, రమేష్ వెజ్జు, విజయ్ కోచెర్ల తో పాటు 100 మందికి పైగా కాపులు హాజరయ్యారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశం, టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల గురించి సమావేశంలో చర్చించారు. కాపులకు మొదటి నుంచి వ్యవసాయమే ప్రధాన ఆధారమని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం పైన ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో తరువాత తరాలకు రిజర్వేషన్లు అవసరమని శ్రీనివాస్ దాసరి చెప్పారు. శౌరి ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రావడానికి ముందే కాపులకు రిజర్వేషన్లు అవసరమని పూలే అభిప్రాయపడ్డారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని, కాపు కార్పొరేషన్కు ఏడాదికి 1000 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని కోరారు.
విజయ్ కోచెర్ల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే బీసీలకు సమస్య లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మంజునాథ్ కమిషన్ను ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో కమిషన్ నిర్ణయాన్ని కాదన్న ప్రభుత్వానికి, కాపుల రిజర్వేషన్ల విషయంలో కమిషన్ గుర్తుకు వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు, కాపులకు మధ్య వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. దుష్ప్రచారాలను బీసీలు నమ్మరాదని.. బీసీలు, కాపులు సోదరుల్లా కలసి ఉంటున్నారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణ డప్పు కొడుతూ సభ్యులను ఆహ్వానించగా, జోహార్ రంగ, కాపుల ఐక్యత వర్దిల్లాలి, జై ముద్రగడ నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది.