రాజమండ్రి : కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ సాధించే వరకూ తాను చేపట్టిన ఉద్యమం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ముద్రగడ విలేకర్లలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబుగారే మమ్మల్ని రోడ్డెక్కించారని ఆరోపించారు.
తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే లాంటి సర్వే నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అయితే ఈ సర్వే ఆలస్యం కాకుండా చూడాలన్నారు. త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వానికి ముద్రగడ సూచించారు.