వైఎస్ఆర్ మూడు నెలల్లో ఇచ్చారు.. మరి నువ్వో!
కిర్లంపూడి : ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని అప్పట్లో మహ్మద్ జానీ లేఖ రాస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి... తక్షణమే స్పందించారని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై మూడు నెలల్లో రిపోర్టు తెప్పించుకుని రిజర్వేషన్లు కల్పించారన్నారు.
ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గడువు పెట్టుకుని కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి కదా అని ముద్రగడ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాపులపై ప్రేమ కురిపించిన చంద్రబాబు... ఇప్పుడు ఏం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కాపు గర్జన నిర్వహించామన్నారు. కాపుల అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఇవ్వాలని, అయితే ఈ ప్రభుత్వం భిక్ష వేసినట్లు కేవలం యాభై కోట్లు, వందకోట్లు ఇచ్చి తమ జాతిని అవమానిస్తోందని ముద్రగడ ధ్వజమెత్తారు.
కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను వర్తింపచేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషను అమలు చేయడంలో వైఎస్ విజయం సాధించారు. ఈ రిజర్వేషన్లతోనే మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు కూడా ఉన్నతవిద్యను చదువుకునే వీలు కలిగింది.