- ముద్రగడ పాదయాత్రపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ
- అణచివేసేందుకు ప్రభుత్వ వ్యూహం
- జిల్లాలో 6 వేల మంది పోలీసుల మోహరింపు
- పలు ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం
- విస్తృతంగా డ్రోన్ కెమెరాల వినియోగం
- నేతలపై కొనసాగుతున్న బైండోవర్ విచారణలు
- నోటీసులు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు
- అయినా పాదయాత్ర జరిపి తీరుతామని కాపు నేతల ప్రకటనలు
సాక్షి, రాజమహేంద్రవరం / జగ్గంపేట : కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలన్న డిమాండుతో.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి జరుప తలపెట్టిన ‘చావో రేవో చలో అమరావతి’ పాదయాత్రపై జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగానే ముద్రగడ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న ప్రభుత్వ వ్యూహం.. ఈసారి ఎలాగైనాసరే పాదయాత్ర జరిపి తీరాలన్న కాపు నేతల ప్రతివ్యూహాల నేపథ్యంలో.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం హీటెక్కుతోంది. గద్దెనెక్కిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. మూడేళ్లు దాటినా తూతూ మంత్రప్రకటనలతో కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని, చేసిన మోసాన్ని తలచుకుంటున్న కాపు సామాజిక యువత, మహిళలు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపులను, పోలీసులతో అణచివేసేందుకు చేస్తున్న యత్నాలపై మండిపడుతున్నారు. పాదయాత్ర విజయవంతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
భారీగా బలగాలు
పాదయాత్రకు గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం మరిన్ని పోలీసు బలగాలను జిల్లాకు రప్పించింది. మండలాల వారీగా పోలీసులను మోహరించింది. కడప, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 5 వేల మంది పోలీసులను రప్పించారు. జిల్లా పోలీసులు మరో వెయ్యి మందితో కలుపుకుని మొత్తం 6 వేల బలగాలు జిల్లాలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడి, పరిసరాలతోపాటు, సున్నిత ప్రాంతాలైన కోనసీమ, కాకినాడ, సామర్లకోట తదితర ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు ఆదివారం కవాతు నిర్వహించారు. ఇప్పటికే కాపు నేతలు, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలపై బైండోవర్ కేసులు పెట్టారు.. పెడుతున్నారు. పాదయాత్రలో పాల్గొనడం చట్టరీత్యా నేరమంటూ నోటీసులు జారీ చేశారు. బైండోవర్ చేసినవారు స్థానికంగా ఉండేలా తహసీల్దార్లు వారిని వాయిదాలకు తిప్పుతున్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 26 వరకు వారిని బైండోవర్ చేశారు. పరిస్థితిని బట్టి తరువాత కూడా బైండోవర్ కొనసాగింపు ఉంటుందని రెవెన్యూ, పోలీసులు అధికారులు పేర్కొంటున్నారు.
మోగుతున్న పోలీసు సైరన్లు
జిల్లాలో సున్నిత ప్రాంతమైన కోనసీమలో దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు. పోలీస్ పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సెక‌్షన్ 144 అమలులో ఉందంటూ మైకు ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, పాల్గొనరాదని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసు వాహనాల సైరన్ల మోతతో కోనసీమ హోరెత్తిపోతోంది. ఆదివారం డ్రోన్ కెమెరాలను కూడా అమలాపురం తీసుకువచ్చారు. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఉపయోగించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిపి తీరుతామని కాపు జేఏసీ నేతలు ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో.. 26వ తేదీన పరిస్థితి ఎలా ఉండనుందన్న ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉండగా, ముద్రగడ పాదయాత్ర విజయవంతం కావాలని కాపు మహిళలు పలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని వేగులమ్మ అమ్మవారి ఆలయంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు.