నగర పాలికను నాశనం చేశారు
- ఎమ్మెల్యే, మేయర్‌పై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ధ్వజం
- కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరశన దీక్ష
- భగ్నం చేసిన పోలీసులు
అనంతపురం న్యూసిటీ : అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప, మున్సిపల్ అధికారులు కుమ్మౖక్కె నగరపాలక సంస్థను నాశనం చేశారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. స్థానిక తిలక్‌రోడ్డు, గాంధీబజార్ రోడ్డు విస్తరణలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఆయన నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరవధిక నిరశన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇతరప్రాంతాల్లో నాయకులంతా స్వచ్ఛభారత్ అంటూ ముందుకెళ్తుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజలు మురికికూపంలోనే చచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. తిలక్‌రోడ్డు, గాంధీబజార్ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ గ్రాంటు కింద రూ.60 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆరోజే ఆదేశాలిచ్చినా ఇప్పటికీ మొదలుపెట్టలేదని మండిపడ్డారు. తాను దీక్ష చేపడతానని ప్రకటించడంతో ఆ ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు ఆదివారం సాయంత్రం పాతూరులో కొన్ని రేకులు మాత్రం తొలగించారన్నారు. మొదట జేసీ దివాకర్‌రెడ్డి గుల్జార్‌పేటలోని తన కార్యాలయం నుంచి అనుచరులతో ర్యాలీగా బయలుదేరి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా బీసీ, ఓసీ, ఐఎంఎం, ఆర్యవైశ్యులు, పలు కుల సంఘాల నాయకులతో పాటు కార్పొరేటర్లు లాలెప్ప, దుర్గేష్, ఉమామహేశ్వర, విద్యాసాగర్, కోగటం శ్రీదేవి, ప్రసన్నలక్షి్మ, టీడీపీ నాయకుడు జయరాం నాయుడు పాల్గొన్నారు.
కలెక్టర్ చేతనే కాలేదు.. మీ చేత ఏమౌతుంది?
‘రోడ్డు విస్తరణ పనులు చేపడతామని కలెక్టరే చెప్పారు. ఏడాదిన్నరగా ఎదురుచూశా. ఎవరైనా పట్టించుకున్నారా..? కలెక్టర్ చేతనే కాలేదు. ఇక మీ చేత ఏమవుతుంది? ’అని దివాకర్‌రెడ్డి ఆర్డీఓ మలోల, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుబ్రమణ్యం, కమిషనర్ సోమనారాయణను ప్రశ్నించారు. దీక్ష విరమించాలని వారు కోరగా ఆయన ఇలా స్పందించారు. ఆక్రమణదారులు కోర్టుకెళితే నగరపాలక సంస్థ లాయర్ లంచం తీసుకుని ఇంతవరకు అఫిడవిట్ ఫైల్ చేయలేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు కలెక్టర్‌కు ఫో¯ŒS చేశారని ఆర్డీఓ చెప్పినా ఎంపీ వినిపించుకోలేదు. ‘కలెక్టర్‌నే రమ్మను’ అని అన్నారు.
దీక్ష భగ్నం
దీక్షలో ఉన్న ఎంపీ దివాకర్‌రెడ్డికి పల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోవడంతో దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన వర్గీయులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు ఎంపీని మోసుకెళ్లి అంబులెన్స్ లోకి ఎక్కించారు. అనుచరులు అంబులెన్స్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ చర్చి వద్దకు చేరుకుని రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. జేసీని సర్వజనాస్పత్రికి తరలించారు. ఆయనకు హృదయ స్పందనల్లో తేడా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు.