తేల్చుకుందాం రా..!
- అభివృద్ధి చేయాలని చూస్తే కర్రపెత్తనమా..?
– మరువవంక శుభ్రం చేయిస్తా .. చేతనైతే రా..!
– ఎమ్మెల్యే వైకుంఠంపై ఎంపీ జేసీ ఫైర్
అనంతపురం న్యూసిటీ : 'పందులను బయటకు పంపిస్తే కర్రపెత్తనమా..ప్లాస్టిక్ వాడొద్దని ప్రచారం చేస్తే కర్రపెత్తనమా.. షాపుల నుంచి చెత్త వేయవద్దని చెబితే కర్రపెత్తనమా.. దోమలు వద్దురా అంటే కర్రపెత్తనమా, రోడ్లు వెడల్పు చేస్తామంటే కర్రపెత్తనమా.. బ్రిడ్జ్ కావాలంటే కర్రపెత్తనమా...రారా నీయబ్బా రేపు అక్కడ (మరువవంక) పని చేయిస్తా కర్రపెత్తనమో... మంచి పెత్తనమో తేలుస్తా' అంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై పరోక్షంగా సవాల్ విసిరారు. మంగళవారం నగరంలోని జేసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
'వాట్ ఈజ్ దిస్ ఎవరో ఒకరు నవ్వపెట్టుకుని ముందుకొచ్చాడు. కంపు తొలగిస్తామని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు. చూద్దాం అనే ఆలోచనే లేదు. పేదోళ్లను బాధపెట్టడమే తెలుసా? బ్రిడ్జ్ వద్ద రైటర్లకు రాంనగర్ పార్క్‌లో స్థలం కేటాయించాలని నిర్ణయించా. అందుకు మేయర్, కమిషనర్ అంగీకరించారు. ఎవరో బుద్ధిలేనోడు ఆరడుగుల స్థలం ఉంది వేసుకోవచ్చని చెప్పాడంట. కుక్క తోక వంకర అన్న తరహాలో సామాన్యులను బాధిస్తున్నారు. అసూయ ద్వేషాలు తప్ప మరొకటి చేయడం లేదు. ఐ యామ్ ఏ డాక్టర్. ఐ విల్ ఆపరేట్. పేషంట్‌కు నొప్పి అంటే నేనేమి చేయలేను. నొప్పి భరించాల్సిందే. పందుల తరలింపు, ప్లాస్టిక్ నిషేధం, రోడ్డు విస్తరణ చేసేటప్పు నొప్పి మామూలే. ముందుకు బాగుంటుంది. మరువ వంక పూడికతీతను బుధవారం నుంచి మొదలుపెట్టి దశలవారీగా శుభ్రం చేయిస్తా'. అంతకుముందు ప్లాస్టిక్‌ను వాడమని ముందుకొచ్చిన వ్యాపారస్తులను ఎంపీ అభినందించారు.
మరువ వంకను పరిశీలించిన ఎంపీ
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరువవంకను పరిశీలించారు. సంగమేశ్వర్ సర్కిల్, రాజా, రమణ థియేటర్, సూర్యనగర్ సర్కిల్, కృష్ణ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్ వరకు మరువవంక పూడికతీతపై అధికారులతో మాట్లాడారు. త్రివేణి థియేటర్ వద్ద మురుగు నిల్వ ఉండకూడదని అందుకేమి చేయాలని ఎస్‌ఈ సురేంద్రబాబు, ఈఈ రామ్మోహన్ రెడ్డిని ప్రశ్నించగా కల్వర్టు వేయించాలన్నారు. అందుకు ఎంపీ రూ కోటి అయినా ఇస్తానని పనులు మొదలుపెట్టాలన్నారు.