ఎంపీ జేసీపై చంద్రబాబుకు ఫిర్యాదు
విజయవాడ: అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య సాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. మంగళవారం ప్రభాకర్ చౌదరి.. చంద్రబాబును కలసి ఎంపీ జేసీపై ఫిర్యాదు చేశారు. అనంతపురంలో తన ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జేసీ కుట్ర పన్నుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
తనకు వ్యతిరేకంగా సోమవారం అనంతపురంలో దివాకర్ రెడ్డి దీక్ష చేపట్టారని ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరంలోని పాతూరు తిలక్‌రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ జాప్యంపై నిరసిస్తూ ఎంపీ జేసీ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరవధిక నిరసన దీక్షకు దిగారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని జేసీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎంపీ జేసీపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభాకర్ చౌదరి సిద్ధమయ్యారు.