సీఎం గారూ..ఇతనెవరో తెలుసా? | munikoti, speshal catagiri, susid | Sakshi
Sakshi News home page

సీఎం గారూ..ఇతనెవరో తెలుసా?

Published Mon, Aug 8 2016 4:48 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికోటి (ఫైల్‌) - Sakshi

ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికోటి (ఫైల్‌)

– సరిగ్గా ఏడాది కిందట మునికోటి ఆత్మాహుతి
– ప్రత్యేక హోదా నినాదంతో తిరుపతిలో ఆత్మబలిదానం
– ఏడాది గడచినా ఇప్పటికీ అందని ఆర్థిక సాయం
– ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన ప్రభుత్వం


సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆయన పరితపించాడు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా హోదా కోసం నినదించాడు. ప్లకార్డులు చేతబట్టుకుని, ఫ్లెక్సీలను భుజాన వేసుకుని ఉద్యమించాడు. తన ఆత్మబలిదానంతోనైనా కేంద్ర ప్రభుత్వం కనికరిస్తుందని ఆశ పడ్డాడు. పట్టపగలు.. వందలాది మంది నడుమ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివ్వెరపోయాయి. పత్రికలు పతాశ శీర్షికలతో కథనాలు రాశాయి. మునికోటి పార్థివ దేహాన్ని సందర్శించిన ముఖ్యనేతలందరూ సంతాపాలు, సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇదంతా జరిగి సరిగ్గా నేటికి ఏడాది. అప్పట్లో మునికోటి త్యాగాన్ని పెద్ద ఎత్తున ప్రశంసించిన సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక సాయం తాలూకు వాగ్దానాన్ని విస్మరించారు. మళ్లీ మునికోటి కుటుంబం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు.

తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగళూరు ముని కామకోటి మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ అభిమాని. గత ఏడాది ఆగస్టు 8న తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా సాధన కోసం పోరుసభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునికోటి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆయన్ని రక్షించే క్రమంలో శేషాద్రి అనే యువకుడు కూడా గాయపడ్డాడు. 70 శాతం గాయపడ్డ మునికోటి మరుసటి రోజున ఆస్పత్రిలో కన్నుమూశాడు. ప్రత్యేక హోదా కోసమే తాను ఆత్మహత్యకు పాల్పడ్డాననని ఆయన మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ సంఘటనపై అన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. ఈ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు స్పందించారు.

‘తిరుపతి సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందనీ, ఎవరూ ప్రత్యేక హోదా కోసం భావోద్వేగాలకు లోను కావద్దని’ హితవు చెబుతూ మునికోటి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఆ తరువాత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ మునికోటి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అప్పట్లో  కాంగ్రెస్‌ పార్టీ కూడా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వీరెవ్వరూ మళ్లీ ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూసింది లేదు.

ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తరపున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరుసటి రోజున బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇవి మాత్రమే ఇప్పటివరకు ఆ కుటుంబానికి అందాయి. అటు ప్రభుత్వం గానీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీ గానీ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేయక పోవడం బాధాకరంగా ఉందని మునికోటి సోదరుడు మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆరాట పడ్డ తన సోదరుడి ఆశయం నెరవేరకపోగా ఆయన కుటుంబానికీ అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు.

ఇదేనా చిత్తశుద్ధి..?
ప్రత్యేక హోదా విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం హోదా సాధన కోసం ప్రాణత్యాగం చేసిన వారి విషయంలోనూ అదే వైఖరిని కనబర్చడం అన్యాయమని వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా వాసి అయి ఉండి, సొంత జిల్లాలో ఆత్మాహుతి చేసుకున్న మునికోటి కుటుంబాన్ని ఆయన ఆదుకోకపోవడం దారుణమని వీరంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement