తిరుపతి బంద్ విజయవంతం
తిరుపతి కల్చరల్: రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి అంత్యక్రియల నేపథ్యంలో కాంగ్రెస్ పిలుపు మేరకు సోమవారం చేపట్టిన తిరుపతి బంద్ విజయవంతమైంది. మద్దతుగా సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుంచే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు రోడ్లపైకి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్, పూర్ణకుంభం సర్కిల్, మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టారు. నగర ప్రధాన వీధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. పూర్ణకుంభం సర్కిల్‌లో ధర్నా సందర్భంగా సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలతో నగర ప్రధాన వీధుల్లో తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత కుట్రలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మద్దతుగా తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించి బంద్‌కు మద్దతు ప్రకటించాయి. నగరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసి వేసి ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్, నాయకులు నాగభూషణం, నైనార్ శ్రీనివాసులు, ఎస్.కుమార్, శ్రీదేవి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రామానాయుడు, చిన్నం పెంచలయ్య, వెంకయ్య, రాధాకృష్ణ, ఎన్‌డీ.రవి, ఏఐటీయూసీ నాయకులు రామచంద్రయ్య, హరికృష్ణ, పీ.మురళి, సీపీఎం రాష్ట్ర నేతలు అజయ్, కృష్ణయ్య, కే.కుమార్‌రెడ్డి, కందారపు మురళి, నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్రమణ్యం, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.