
'అతడి ప్రాణత్యాగం వృధాగా పోకూడదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన మునికోటి మృతికి సంతాపంగా మంగళవారం ఏపీ బంద్ కు సీపీఐ పిలుపునిచ్చింది. బంద్ కు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
'మనందరి స్వప్నం కోసం మునికోటి ఆత్మార్పణం చేశాడు. అతడి ప్రాణత్యాగం వృధాగా పోకూడదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేపట్టిన బంద్ కు మా పార్టీ మద్దతు తెలియజేస్తోంది' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, రేపటి బంద్ నుంచి తిరుపతికి మినహాయింపు ఇచ్చారు. బంద్ కారణంగా మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో జరగాల్సిన డిగ్రీ, బీఈడీ పరీక్షలు వాయిదా పడ్డాయి.
సోమవారం తిరుపతిలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్ పాటించాయి. మునికోటి భౌతిక కాయానికి స్థానికి హరిశ్చంద్ర శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శనివారం తిరుపతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అతడు మృతి చెందాడు.
Munikoti's sacrifice for our shared dream will not be wasted. Our party stands in support of CPI's bandh call tomorrow on AP Special Status.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2015