నంగునూరు: ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేసి రైతులను అదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి ఎల్లా తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత రబీ సీజన్‌లో నీళ్లులేక పంటలు ఎండిపోతే ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిందని, నేటి వరకు అన్నదాతలకు పరిహారం అందలేదన్నారు.
పంటలు పండక, పరిహారం అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరువులు, బావులు, బోర్లలో నీళ్లులేక 50 శాతం పైగా మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా పరిహారం అందించాలని కోరారు.