రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
* వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం
* రెండేళ్లుగా కరువు పరిస్థితులున్నా చర్యలేవీ?
* రూ. వెయ్యి కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకా అందలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ60 ఏళ్లలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ సర్కారేనని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులు జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, బండారు వెంకటరమణలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇంతవరకు అందలేదన్నారు. రైతు రుణ మాఫీ కింద మిగిలిన 50 శాతం రుణాన్ని వడ్డీతో కలిపి ఒకేసారి మాఫీ చేసి వారికి కొత్త రుణాలు కూడా వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈసారి పత్తి పంట వేయొద్దని రైతులకు చెబుతున్న పోచారం సహా ఇతర మంత్రులు.. ఇందుకోసం రైతులకు అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
రైతులకు సబ్సిడీపై సోలార్ పంపుసెట్లు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని నిలదీశారు. స్కైవేలు, ఫ్లైఓవర్లు అంటూ ప్రతి విషయంలోనూ హైటెక్ ప్రచారం తప్ప రైతుల విషయంలో కేసీఆర్ శ్రద్ధ చూపట్లేదని విమర్శించారు. పాలీహౌస్ వ్యవసాయం విషయంలోనూ ప్రభుత్వం హామీ నిలుపుకోలేదన్నారు.
గతేడాది కోటి ఎకరాల మేర సాగులోకి తెస్తామన్న ప్రభుత్వం, చివరకు 88 లక్షల ఎకరాల వరకు రైతులు పంటలు వేసినా వారికి ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఏడాది 1.12 కోట్ల ఎకరాల్లో పంటలు వేయనున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు 4,58,331 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు వైఎస్సార్ హయాంలో అనుమతిచ్చారని, ఇప్పుడు హరితహారం పేరిట ఎస్టీలను ఆ భూముల నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ భూముల్లో గిరిజనులు వ్యవసాయం చేసేందుకు అనుమతివ్వాలని, అటవీశాఖ అధికారులు అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని విమర్శించారు.