రాష్ట్ర విభజన చేయాలని నేనే చెప్పా | Chandrababu Comments on State Division | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన చేయాలని నేనే చెప్పా

Published Mon, Dec 31 2018 3:07 AM | Last Updated on Mon, Dec 31 2018 4:58 AM

Chandrababu Comments on State Division - Sakshi

సాక్షి, అమరావతి: తనతో జై తెలంగాణ అనిపించానని కేసీఆర్‌ అంటున్నారని అది సరికాదని తానే రాష్ట్రాన్ని విభజించాలని చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. రాష్ట్ర విభజన సక్రమంగా చేసి, రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరానన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో ఆదివారం మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనపై చేసిన విమర్శలపై చంద్రబాబు స్పందించారు. హరికృష్ణ చనిపోయినప్పుడు పొత్తు పెట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ను అడిగానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్‌ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని, బెదిరించాలని చూస్తున్నారని తాను భయపడనని చెప్పారు. కేసీఆర్‌ ఒక్కకేసు పెడితే తాను నాలుగు కేసులు పెడతానని హెచ్చరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి చాలా వ్యవహారాలు ఉన్నాయని, కేసీఆర్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడేది లేదన్నారు.

బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి తెలంగాణను వదిలేసినప్పటికీ తనపై కేసీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. తనను డర్టీ (చెత్త) పొలిటీషియన్‌ అని, కాంగ్రెస్‌ నాయకులను ఇడియట్స్‌ అని తిట్టడం హుందాతనం కాదన్నారు. కేసీఆర్‌ భాష అసభ్యంగా ఉందని, అధికారంలో ఉండే వ్యక్తులు హుందాగా ఉండాలన్నారు. మోదీ గాడని, చంద్రబాబు దద్దమ్మని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. తన రాజకీయ జీవితం మొత్తం హుందాతనాన్ని కోల్పోలేదన్నారు. 2009లో తాను వద్దన్నా కేసీఆర్‌ బతిమాలుకుని పొత్తు పెట్టుకున్నారని, 44 సీట్లు ఇస్తే పది గెలిచారని, అవకాశవాద రాజకీయాలు ఎవరివి? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏపీకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటున్నారని, అలాగైతే రాష్ట్రానికి వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చని అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి మాటమార్చింది ఎవరని ప్రశ్నించారు.

నన్ను భట్రాజులా పొగిడారుగా..
ఇప్పుడు తనను తిడుతున్న కేసీఆర్‌ అప్పట్లో తనను బ్రహ్మాండంగా, భట్రాజులా పొగిడారని చంద్రబాబు అన్నారు. తాను ఎన్టీఆర్‌ దగ్గర నుంచి టీడీపీని లాక్కున్నానని అంటున్నారని, అప్పుడు కేసీఆర్‌ తన పక్కనే ఉన్నారని, వైశ్రాయ్‌ హోటల్‌లో అంతా ఆయనే ఆర్గనైజ్‌ చేశాడని, దానికి సిద్ధాంతకర్త ఆయనేనని, ఆ తర్వాతే మంత్రయ్యారని చెప్పారు. కేంద్రం రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చారు అన్నారని, కేసీఆర్‌ ఇంటికి రూ. 300 కోట్లు కావాలి, సచివాలయం మాత్రం మామూలుగా ఉండాలా అని ప్రశ్నించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి డబ్బులిచ్చిందన్నారు. కేసీఆర్‌ కనీసం సచివాలయానికి కూడా వెళ్లరని ఆరోపించారు. జనార్దన్‌రెడ్డి ఐటీ టవర్‌కు ఫౌండేషన్‌ ఎక్కడ వేశారో తనకు తెలియదన్నారు. రాజీవ్‌గాంధీ ఐటీని ప్రోత్సహించిన మాట నిజమేనన్నారు. హైకోర్టు విభజనను తాను వ్యతిరేకించలేదని, కొంత సమయం ఇవ్వాలి అని అడిగానన్నారు.

మోదీ, కేసీఆర్‌ ఇష్టపడి తిట్టుకుంటున్నారు
కేసీఆర్, మోదీ బయటకు ఒకరినొకరు ఇష్టపడి తిట్టుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నారని, లోపల మాత్రం కలుసుకుంటున్నారని ఆరోపించారు. తమ సచివాలయానికి వేసిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కూడా చులకనగా మాట్లాడటం సరికాదన్నారు. నాలుగేళ్లలో తెలంగాణలో వ్యవసాయ సగటు వృద్ధి 0.2 శాతమని, అదే ఏపీలో 11 శాతమని, ఇంత వృద్ధి సాధించిన వారి దగ్గర పథకాలు కాపీ కొట్టాల్సిన అవసరం ఏమిటన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణలో లక్ష కోట్లు ఖర్చు పెట్టానంటున్నాడని, ఎక్కడా ప్రాజెక్టులు కనిపించడం లేదన్నారు. హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు, హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు.. అవన్నీ తనవేనన్నారు. విభజన తర్వాత హైదరాబాద్‌ పోయినా తాను బాధ పడలేదన్నారు. గతంలో ఏపీకి రూ. 500 కోట్లు ఇస్తామన్న కేసీఆర్, ఇప్పుడు కేంద్రం రూ.1500 కోట్లు ఇస్తే చాలదా అనడం ఏమిటన్నారు. మిగులు బడ్జెట్, అధిక ఆదాయం ఉన్నా తెలంగాణ వృద్ధి తక్కువుగా ఉందని, లోటు బడ్జెట్, అత్యల్ప ఆదాయం ఉన్నా ఏపీ ఎక్కువ వృద్ధి సాధిస్తోందన్నారు. 0.2 శాతంగా ఉన్న తెలంగాణ వ్యవసాయ వృద్ధి దేశానికి ఎలా నమూనా అవుతుందని ప్రశ్నించారు. తనకు ఇంగ్లీషు రాదంటున్నారని, కేసీఆర్‌ ఏమైనా ఆక్స్‌ఫర్డ్‌లో చదివాడా అని ప్రశ్నించారు.

మోదీ తిట్టిస్తున్నారు 
ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని కేసీఆర్‌తో తిట్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మోదీ కోసం కేసీఆర్, జగన్‌ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందడం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అభివృద్ధి చెందితే తన డొల్లతనంబయటపడుతుందని భయమని, ఏపీ అభివృద్ధి చెందితే తాను ఏమీ చేయలేదని విషయం దేశమంతా తెలుస్తుందని మోదీ భయపడుతున్నారని చెప్పారు. అందుకే వారిద్దరూ కలిసి తనను తిడుతున్నారన్నారు. వెలుగుబంటి సూర్యనారాయణ కేసు నుంచి కేసీఆర్‌ను మోదీ తప్పించారని ఆరోపించారు. కేసులు లేకపోతే పెట్టడం, కేసులుంటే వాటిని చూపి బెదిరించడం మోదీ పని అని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కేసీఆర్, కవిత పార్లమెంటులో అవిశ్వాసం పెడితే మాత్రం మద్దతివ్వలేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ను తప్పుబట్టలేదని, వాస్తవాలు మాత్రం చెప్పానన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వెళ్లిన కేసీఆర్‌ అక్కడ ఏమీ జరగకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారన్నారు.

మోదీ వద్దనడం వల్లే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో కేసీఆర్‌ పొత్తుకు ముందుకు రాలేదన్నారు. కేసీఆర్‌ తన నియోజకవర్గంలో ఒక్క ఎకరా భూమిని కూడా రిజర్వాయర్‌ కోసం సేకరించలేకపోయారని, తాము రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించామన్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ ఎంత బలంగా ఉంటే, అదేస్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్‌ ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు కాంట్రాక్టుల రూపంలో చాలా గిఫ్ట్‌లు, డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. మోదీ నంబర్‌ వన్‌ అయితే కేసీఆర్‌ మిడిల్‌ మోదీ అని, జగన్‌ జూనియర్‌ మోదీ అని విమర్శించారు. కేసీఆర్‌ తిడుతున్నారని, జగన్‌ ట్వీట్‌ చేస్తున్నారని, వీరిద్దరికీ మోదీ ఫోన్‌ చేసి మెచ్చుకుంటున్నారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement