
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలి
బుధవారం పట్టణంలోని కోదాడ టాలెంట్ స్కూల్‌లో ట్రాఫిక్ నియంత్రణపై జరిగిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
కోదాడ: పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇబ్బందిగా ఉన్నాS తప్పదని కోదాడ పట్టణ సీఐ రజితారెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని కోదాడ టాలెంట్ స్కూల్‌లో ట్రాఫిక్ నియంత్రణపై జరిగిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైందని దీనిని క్రమపద్దతిలో పెట్టడానికి పట్టణ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఉన్న ఆక్రమణలు తొలగించడానికి మున్సిపాల్టీ సిద్ధంగా ఉందని మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి తెలిపారు. డబ్బాకొట్లను, వాటి ముందు ఉన్న ఆక్రమణలు కూడా తొలగించడానికి తగు చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ వంటిపులి అనిత తెలిపారు. అనంతగిరి రోడ్డును వన్‌వేగా మార్చాలని పలువురు కోరారు. ఈ రోడ్డులో వెహికిల్ పార్కింగ్ చెయకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, అవగాహన కల్పించడానికి బాణాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో 13 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ నాయకులతో పాటు విద్యుత్, మున్సిపల్ శాఖ అధికారులతో అటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.