మళ్లీ వచ్చిన మువ్వా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు :
విద్యాశాఖలో వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్న మువ్వా రామలింగం మరోసారి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు. వివాదాలకు నెలవైన ఆయనను మళ్లీ జిల్లాకు తీసుకు రావడం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు కీలక పాత్ర పోషించారు.
-
డీఈవోగా రామలింగం నియామకం
-
టీడీపీ ముఖ్యనేత తీవ్ర ప్రయత్నంతో రాక
-
ఆయన నియామకాన్ని వ్యతిరేకించిన టీడీపీలోని ఒక వర్గం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు :
విద్యాశాఖలో వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్న మువ్వా రామలింగం మరోసారి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు. వివాదాలకు నెలవైన ఆయనను మళ్లీ జిల్లాకు తీసుకు రావడం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు కీలక పాత్ర పోషించారు. టీడీపీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆ ముఖ్య నాయకుడు తన భుజాల మీద బాధ్యత వేసుకుని జిల్లాకు రప్పించారు.
మువ్వా రామలింగం 2006లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఆయన వివాదాస్పద తీరుపై అప్పట్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసింది. అక్కడి నుంచి 2007లో గుంటూరు డీఈవోగా బదిలీ అయ్యారు. అక్కడ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి గుర్తింపు కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి సస్పెండ్ అయ్యారు. 2008లో కర్నూలు డీఈవోగా పోస్టు సంపాదించిన ఆయన అక్కడ డీయస్సీ నియామకాలు, ఉపాధ్యాయ సంఘాలతో గొడవల నేపధ్యంలో వివాదాస్పద పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కొంతకాలం పోస్టింగ్ లేకుండా గడిపిన మువ్వా రామలింగం నెల్లూరుకు బదిలీ అయ్యారు. 2011 జూన్, 18వ తేదీ నెల్లూరు డీఈవోగా బదిలీ మీద వచ్చిన రామలింగం 2014 ఏప్రిల్, 19వ తేదీ దాకా ఇక్కడ పనిచేశారు. విధి నిర్వహణలో అరోపణలతో పాటు, ఉపాధ్యాయ సంఘాలతో గొడవల కారణంగా జిల్లాలోని ఒకటి, రెండు మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట నెల రోజల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాయి. సూళ్లూరు పేటలో నిర్వహించిన సైన్స్ ఫేర్‌కు షార్ నుంచి శాస్త్ర వేత్తలు వచ్చినట్లు బోగస్ సంతకాలు చేయించి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి. కావలిలో నిర్వహించిన సైన్స్ ఫేర్‌కు అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు రూ.1.20 లక్షలు విరాళం ఇస్తే ఆ సొమ్ము తన సొంత ఖాతాలో వేసుకున్నారు. రామలింగం తీరుపై ఆగ్రహించిన అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ సిఫారసుతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సుమారు ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఉన్న ఆయన, ఆ తర్వాత ఒంగోలు డీఈవోగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అక్కడ ఆరేడు నెలలు పనిచేసిన తర్వాత టీడీపీ నాయకులతో ఏర్పడిన గొడవల కారణంగా ఆయన మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు పరిపాలనాధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి బలమైన రాజకీయ సిఫారసులు చేయించి నెల్లూరు జిల్లాకు పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ విషయం తెలిసి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.