ఎంజీ యూనివర్సిటీకి న్యాక్ ‘బి’ గుర్తింపు
Published Sat, Sep 17 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
ఎంజీయు (నల్లగొండ రూరల్): మహాత్మగాంధీ యూనివర్సిటీకి నేషనల్ ఎసెస్‌మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ‘బి’ గుర్తింపు నిచ్చింది. ఈ నెల 15న బెంగుళూరులో జరిగిన న్యాక్ 17వ సమావేశంలో యూనివర్సిటీకి 2.32 స్కోరుతో ‘బి’ గ్రేడ్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు యూనివర్సిటీకీ సమాచారాన్ని అందించింది. ‘బి’ గ్రేడ్ గుర్తింపుతో యూనివర్సిటీకి యూజీసీ, రూసా పథకాల నుంచి నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో యూనివర్సిటీ అభివృద్ధి వైపు అడుగులు పడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఫెలోషిప్ అవకాశాలతో యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికెట్‌కు దేశ, విదేశాల్లో గుర్తింపు లభించనుంది. జాతీయ సెమినార్‌లో కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది.
మరో ఏడాది ఆగితే బాగుండేది
యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం వెళ్లడం తొందరపాటుగానే విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి. పూర్తిస్థాయిలో వీసీలు లేకపోవడంతో ఇన్‌చార్జి వీసీల పాలనలో న్యాక్ గుర్తింపు కోసం వెళ్లడం వల్ల 2.32 స్కోరుతో ‘బి’ గ్రేడ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం వీసీగా ఆల్తాఫ్ హుస్సేన్ నియామకమైన నేపథ్యంలో మరో ఏడాది పాటు ఆగి న్యాక్ గుర్తింపు కోసం వెళ్తే సరైనవిధంగా గుర్తింపు వచ్చి, నిధులు బాగా వచ్చేవని భావిస్తున్నారు. పూర్తిస్తాయిలో గ్రంథాలయం అందుబాటులోకి రాకపోవడం, క్రీడామైదానం, కొత్త కోర్సు, ఇంజనీరింగ్ భవనాలు లేకపోవడం, పరిశోధనలు జరుగకపోవడం, పూర్తిస్థాయిలో ఫ్రొఫెసర్లు లేకపోవడం ప్రధాన లోపంగా భావించిన న్యాక్ ‘బి’ గ్రేడ్‌తో సర్టిపెట్టింది. ఏడాది పాటు ఆగితే వీసీ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేసే అవకాశం ఉండి సరైన గుర్తింపు వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement