రచ్చ...రచ్చ
కడప కార్పొరేషన్:
కడప నగరపాలక సంస్థలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రచ్చ...రచ్చగా కొనసాగింది. ఆద్యంతం సభ గందరగోళం మధ్య సాగింది. ఉరీ ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్లకు సభ నివాళి అర్పించింది. సమావేశం ప్రారంభం కాగానే తమను ఆఖరి సీట్లలో కూర్చొబెట్టి తెలుగుదేశం పార్టీ సభ్యులంతా ముందు సీట్లలో కూర్చొన్నారని, వారు ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీ సభ్యుల ప్రక్కన ఎలా కూర్చొంటారని కార్పొరేటర్ బోలా పద్మావతి ప్రశ్నించడంతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో మేయర్ ప్రక్కన ఎమ్మెల్యే ఎలా కూర్చొంటారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.
ఈ విషయం వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదులాటకు దారితీసింది. ఈ దశలో సీటింగ్ విషయంలో నిబంధనలు ఎలా ఉన్నాయని మేయర్ సురేష్‌బాబు కమీషనర్ పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇందుకు కమీషనర్ సమాధానమిస్తూ ఎన్నికల తర్వాత నిర్వహించే మొదటి సమావేశంలో మాత్రమే సీటింగ్ విషయమై నిబంధనలున్నాయని తర్వాత నిర్వహించే సమావేశాలకు లేవని తెలిపారు. మేయర్ సమ్మతితో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన ప్రక్కన కూర్చొవచ్చని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
– జాతీయ పట్టణ పారిశుద్ద్య పాలసీ–2008 ప్రకారం నగరపాలక వ్యర్థ పదార్థాల నిర్వహణ, పారిశుద్ద్యం మెరుగు పరుచుటకు ‘సిటీ శ్యానిటేషన్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై సభ్యులు పాకా సురేష్, మగ్బూల్‌బాషా మాట్లాడుతూ చట్టబద్దత, హక్కులు లేని ఈ కమిటీకి ఏం విలువుంటుందని ప్రశ్నించారు. దీనిపై కమీషనర్ స్పందిస్తూ ఇది పార్లమెంటులో చట్టమై వచ్చిందని, ఈ కమిటీ తీర్మాణాలను నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
జీవో నంబర్ 279 అమలుకు విముఖత
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 279 అమలుపై జనరల్ బాడీ విముఖత ప్రదర్శించింది. కార్పొరేషన్ సాదారణ నిధులు, 13, 14 ఆర్థిక సంఘ నిధులు, నాన్‌ప్లాన్ గ్రాంట్లతో ప్రతిపాదిత పనులు చేయలేమని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తే అమలు జరుపగలమని తీర్మాణించారు. నగరంలో తహసీల్దారు ఆఫీసు ప్రక్కన ఉన్న ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలంలో ఆప్కోమెగా షోరూమ్ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఇవ్వడానికి పాలకవర్గం ఆమోదం తెలిపింది. నెహ్రూ పార్కు నిర్వహణకు సంబంధించి వాకర్స్ అసోషియేషన్‌కు ఒక సంవత్సర కాలానికి ఇచ్చిన లీజు గడువు ముగిసినందున కార్పొరేటర్లు, అధికారులతో కూడిన కమిటీ ఇచ్చే నివేధిక ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తీర్మాణించారు. పుట్లం పల్లిలో గ్రామ సర్వేనంబర్ 159/8లో ఒక ఎకరా స్థలంలో గిరిజన భవన్ నిర్మించుటకు ఎన్‌ఓసీ ఇవ్వడానికి అంగీకరించారు. రామక్రిష్ణ మిషన్ సంస్థకు సంబంధించిన వివేకానంద విద్యానికేతన్ స్కూల్‌కు పన్ను మినహాయింపు ఇవ్వాలని, కుక్కలకు అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు సాదారణ నిధులను కేటాయించుటకు సభ్యులు అంగీకరించలేదు.
బహిర్భూమికి బై బై
కడప నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ మల, మూత్ర విసర్జన చేపట్టకూడదని తెలుపుతూ ధ్రువీకరణ ప్రతాన్ని సమర్పించడానికి కార్పొరేటర్లు సమ్మతిని తెలియజేశారు. అయితే ఒపెన్ డెఫికేషన్ జరుగుతున్న రాయల్ థియేటర్, వన్‌టౌన్ సమీపాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సభ్యుడు ఎంఎల్‌ఎన్ సురేష్ సూచించారు. సాయిపేటలో నగరపాలక ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉందని స్థానిక కార్పొరేటర్ సుజాత తెలిపారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, పాత బస్టాండు సమీపాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని మగ్బూల్‌బాషా చెప్పారు. ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ కమ్యునిటీ టాయ్‌లెట్ల నిర్వహణ కష్టసాధ్యమని, వ్యక్తిగత టాయ్‌లెట్లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
– కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు షకీల్ అహ్మద్, వి. గుర్రప్ప, ఏ. శ్రీనివాసులు, పి. కిషోర్, ఎం. రాజశేఖర్‌లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి ఇవ్వడానికి జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. చిన్నచౌకు మినీ ౖ»ñ పాస్ సర్కిల్‌లో సంజన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, వన్‌టౌన్ సమీపంలో ఉన్న రెడ్డి జయశ్రీ పే అండ్ యూజ్ టాయ్‌లెట్లకు ఉన్న లీజును రద్దుపరిచి, ఆ టాయ్‌లెట్లను పడగొట్టి ఆ స్థలాన్ని హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ వారికి ఇవ్వాలని నిర్ణయించారు.
నోరు జారి...ఆపై క్షమాపణ చెప్పి
ప్రకాష్‌నగర్, ఓంశాంతి నగర్‌లో నెలకొన్న భూగర్భ డ్రై నేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సభ్యులు కె. బాబు సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను చూపిస్తూ సభ మధ్యలో నిరసన తెలిపారు. ఆయనకు సానపురెడ్డి శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డిలు మద్దతు పలుకుతూ అధికార పార్టీ వారికే అధికారులు పనులు చేస్తున్నారని చెప్పారు. పాలకపక్షంగా ఉంటూ ఎలా ఆందోⶠన చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తుండగా, ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి మారిన జేసీబీ పీటర్స్ రెచ్చిపోయారు. అది కరపత్రిక అంటూ నోరుపారేసుకున్నారు. ఇలాంటి కథనాలు ఒక్క సాక్షిలోనే కాదు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాయంకాలం దినపత్రిల్లోనూ ప్రచురించారని, అవికూడా కరపత్రికలేనా అని వారు ప్రశ్నించడంతో అవి కూడా అలాంటివేనని చెప్పారు.
దీంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి, పాకాసురేష్ తదితరులు జోక్యం చేసుకొని పీటర్స్‌తో సభలో క్షమాపణ చెప్పించడంతో ఈ వివాదం సమసిపోయింది.
సభలోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు
జీవో నంబర్ 279ను రద్దు చేయాలని, వివిధ కాలనీల్లో నిల్వ ఉన్న వర్షపునీటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ ఎదుట ఆందోళన నిర్వహించిన సీపీఐ నాయకులు గేట్లు తోసుకొని కార్యాలయంలోకి, అటునుంచి సర్వసభ్య సమావేశం జరుగుతున్న కౌన్సిల్ హాలులోకి ప్రవేశించారు. పోలీసులు, సిబ్బంది వారిని నిలువరించలేకపోయారు. ఆందోళనకారులు సభలోకి రావడంతో మళ్లీ గందరగోళం చెలరేగింది. ఒక దశలో సీపీఐ కార్యకర్తలు, కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో అనుమతి లేకుండా ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సెక్రటరీ చెన్నుడు, ఎస్‌ఈ ఉమామహేశ్వరరావు, ఎంఈ చెన్నకేశవరెడ్డి, ఎంహెచ్‌ఓ వినోద్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ కొండారెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ శివనాగేంద్ర, ఆర్‌అండ్‌బి ఈఈ చంద్రశేఖర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.