హిమాలయాలకు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌లో పట్టుకున్న పోలీసులు
అనంతపురం సెంట్రల్ : ఒత్తిడి తట్టుకోలేక.. బడి ఎగ్గొట్టి... హిమాలయాలకు బయలుదేరిన ‘నారాయణ స్కూల్’ విద్యార్థులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ పట్టణ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా విద్యార్థుల ఆచూకీని కనుగొన్నట్లు అనంతపురం మూడో పట్టన సీఐ వెంకటేశులు తెలిపారు. రైల్వే పోలీసుల సహకారంతో తీసుకొని వారిని పట్టుకున్నారు. అనంతపురం మూడో రోడ్డుకు చెందిన విద్యార్థులు ప్రణవ్ దీక్షిత్, షమీర్ మంగళవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే.
ఇక్కడి నారాయణ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణవ్‌దీక్షిత్, సెయింట్ థామస్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదివే షమీర్‌ఖాన్ మంచి స్నేహితులు. గతంలో ఇద్దరూ నారాయణ స్కూల్ ఒకే తరగతిలో చదువుకున్నారు. ప్రస్తుతం కూడా నారాయణ స్కూల్‌లో యోగా నేర్చుకుంటున్నారు. అయితే మంగళవారం రాత్రి లేఖ రాసి మరీ ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం లేచినప్పటి నుంచి యోగాపైనే ధ్యాస పెట్టిన విద్యార్థులు నిత్యం ఆన్‌లైన్‌లో యోగా గురువుల ఉపన్యాసాలు వింటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం రాత్రి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో సైకిళ్లు పెట్టి వెళ్లిపోయారు. వారి ఆచూకీ తెలియలేదు. బుధవారం రాత్రి విద్యార్థుల్లో ఒకరు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వెంటనే సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా సిగ్నల్‌ను గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెళ్తున్నట్లు కనుగొన్నారు.
వెంటనే స్థానిక రైల్వే సీఐ వినోద్‌కుమార్ సహకారంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ రైల్వే పోలీసులతో మాట్లాడారు. రైల్లో ఇద్దరు విద్యార్థులు వస్తున్నట్లు తెలిపారు. నిఘా పెట్టిన అక్కడి పోలీసులు విద్యార్థులను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల బంధువులను, కొంతమంది పోలీసులను పంపి జిల్లాకు తీసుకొస్తున్నారు. శుక్రవారం అధికారికంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పజెప్పనున్నట్లు త్రీటౌన్ సీఐ వెంకటేశులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే తక్షణం స్పందించడం ద్వారా ఆచూకీని త్వరితగతిన కనుగొనగలిగామని సీఐ అన్నారు.
‘నారాయణ’ విద్యార్థుల ఆచూకీ లభ్యం
Published Fri, Mar 24 2017 12:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
Advertisement
Advertisement