నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయం
- నారాయణఖేడ్‌కు పూర్వవైభవం
- రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఖేడ్ పట్టణం
- స్థానికుల్లో హర్షాతిరేకాలు
నారాయణఖేడ్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నారాయణఖేడ్ వాసులు కల నెరవేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాలుగా నష్టపోయిన ఖేడ్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ కేంద్రం కానుంది. ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంత ప్రజల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.
రెండు రోజుల క్రితం జరిగిన అఖిలపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో జిల్లాలు, డివిజన్ల విభజనకు సంబంధించిన తుది ముసాయిదాను ప్రభుత్వం ప్రచురించడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమమైంది.
మొదట నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు, అందోల్ నియోజకవర్గంలోని పలు మండలాలను కలుపుతూ ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తారని భావించారు. అయితే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌ను ఓ డివిజన్‌గా, జహీరాబాద్‌ను మరో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఏర్పాటు కానున్న ఖేడ్ రెవెన్యూ డివిజన్‌లో నియోజకవర్గంలోని ఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టి, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలాలతోపాటు ఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న నాగల్‌గిద్ద, సిర్గాపూర్ మండలాలను కలుపుతున్నారు. అంటే ఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలాలు కలపడంతో మొత్తం ఏడు మండలాలతో ఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.
ఖేడ్ నియోజకవర్గంలో ఉన్న పెద్దశంకరంపేట మండలాన్ని ఆ ప్రాంత వాసుల కోరిక మేరకు మెదక్ రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెద్దశంకరంపేట మండలం మెదక్ నియోజకవర్గంలోనే ఉంది. పునర్విభజనతో ఖేడ్‌లో కలిసింది. ఇక ఈ డివిజన్‌లో అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలం ఒక్కటే అదనంగా చేరుతుంది. భౌగోళికంగా చూస్తే ఈ మండలాలన్నీ ఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోనే ఉంటాయి. మధ్యస్థంగా నారాయణఖేడ్ ఉండగా చుట్టూ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం సైతం రవాణా, పరిపాలనా పరంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ డివిజన్‌ను ఏర్పాటు చేస్తోంది.
గతంలో ఖేడ్ డివిజన్ కేంద్రమే!
ఆరో నిజాం కాలం నుంచే నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండేది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంగా ఉండేంది. ఈ ప్రాంతాన్ని నాడు నాలుగు సర్కిళ్లుగా విభజించారు. కల్హేర్, ఏల్గోయి, కంగ్టి, నారాయణఖేడ్ సర్కిళ్లుగా ఉండేవి. అప్పట్లో 16 జిల్లాలు ఉండగా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ రాష్ట్రాలను మూడుగా విభజించారు.
దేశ్‌ముఖ్‌లు మాలీపటేళ్లుగా, దేశ్‌పాండేలు పట్వారీలుగా, మైనార్టీ ప్రముఖులు పోలీస్ పటేళ్లుగా కొనసాగారు. అనంతరం బీదర్ జిల్లా కింద నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలను మార్చారు. 1956లో రాష్ట్రాల పుర్వ్యవస్థీకరణలో నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో వీలీనం కావడంతో డివిజన్లను తొలగించారు. కేవలం నియోజకవర్గాలుగానే ఉంచారు.
అభివృద్ధికి ఆస్కారం
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఖేడ్ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆర్డీఓతోపాటు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్య, వైద్య, పశువైద్య, వ్యవసాయ తదితర శాఖల్లో డివిజన్‌స్థాయి అధికారులు, ఎస్సీ స్థాయి అధికారులు ఇక్కడ కొలువుదీరే అవకాశం ఉంది.
ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు ఉన్న రహదారిని నేషనల్ హైవే 51గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంజీరా పరీవాహక ప్రాంతం కావడం, కర్మాగారాల ఏర్పాటుకు భూములు, నీటి అనుకూలత ఉంది. ఖేడ్ మండలం జూకల్ శివారులో పాలిటెక్నిక్, మార్కెట్ యార్డు తదితర ప్రభుత్వ భవనాలు ఉన్నందున ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమి ఉంది.
ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు కూడా ఎటువంటి స్థల సమస్య లేదు. ఉప ఎన్నిక సమయంలో కూడా ఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. మంత్రి హరీశ్‌రావు ఖేడ్‌ను డివిజన్ చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు బహిరంగంగా ప్రకటించారు. మొత్తంగా ఈ ప్రాంత ప్రజల కల ఎన్నో ఏళ్లకు నెరవేరుతుండటంతో స్థానికులు సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమాయ్యారు.