నిలిచిన బొగ్గు డంపర్లు
- బొగ్గు బావుల్లో సార్వత్రిక సమ్మె సక్సెస్
- స్వచ్ఛందంగా పాల్గొన్న కార్మికులు
- నిలిచిన బొగ్గు లారీలు, డంపర్లు
సింగరేణిలో సమ్మె విజయవంతమైంది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గురువారం రాత్రి షిఫ్టు విధులకు హాజరైన కార్మికులతోనే పనులు కొనసాగించారు. భూగర్భ, ఓపెన్ కాస్టు గనులు, డిపార్ట్‌మెంట్లు, స్టోర్స్, వర్కషాపులు కార్మికుల లేక వెలవెలబోయాయి.
రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో విజయవంతమైంది. కొత్తగూడెం ఏరియాలో అత్యవసర సిబ్బంది మినహా ఇతర కార్మికులు విధులకు హాజరుకాలేదు. గురువారం నైట్‌షిఫ్ట్‌కు వచ్చిన కార్మికులను ఇళ్లకు పంపించకుండా వారితోనే ఏరియా అధికారులు ఉత్పత్తిని కొనసాగించారు. జీకే ఓసీ, జేవీఆర్ ఓసీ, పీవీకే–5బీ, వీకే–7, ఎస్‌అండ్ పీసీ, ఏరియా స్టోర్స్, ఏరియా వర్క్‌షాప్, సివిల్ డిపార్ట్‌మెంట్, ఎంవీటీసీ, డిస్సెన్సరీ, గెస్ట్ హౌస్, ఏజెంట్, జీఎం ఆఫీసుల్లో 3,586 మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా, 1034 మంది కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. 155 మంది కార్మికులు లీవ్‌లో ఉండగా సుమారు 2400 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనడంతో ఓసీలో ఓబీ పనులు నిలిచాయి. బొగ్గు రవాణాలేని కారణంగా ఆర్‌సీహెచ్‌పీలో లారీలు నిలిచిపోయాయి. కాగా ఉత్పత్తి సజావుగా సాగిందని అధికారులు చెప్పుకొస్తున్నారు.