24న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు
-
సికింద్రాబాద్‌లో ప్రారంభం
-
తొలిరోజు షంషేర్ ఖాన్‌కు సన్మానం
గుంటూరు స్పోర్ట్స్ : 3వ జాతీయస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ టోర్నమెంట్ ఈ నెల 24, 25 తేదీలలో సికింద్రాబాద్‌లోని ఎంసీహెచ్ స్విమ్మింగ్ ఫూల్ నిర్వహిస్తున్నారని రాష్ట్ర మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి జె.లక్ష్మీనారాయణ చెప్పారు. శుక్రవారం బందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్డేడియంలో మాస్టర్ అథ్లెటిక్స్ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర మాస్టర్ స్విమ్మింగ్ జట్టుకు ఎంపికైనా స్విమ్మర్స్ ఈ నెల 23 వlతేదీ సాయంత్రం 4గంటలలోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
ప్రారంభోత్సవం రోజున షంషేర్ ఖాన్‌కు సత్కారం....
సాక్షి పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిన జిల్లాకు చెందిన తొలి ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్‌ను జాతీయస్థాయి స్విమ్మింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నట్లు జె.లక్ష్మినారాయణ వెల్లడించారు. 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన తొలి ఒలింపిక్స్ పోటీలలో 33 దేశాలకు చెందిన 235 మంది స్విమ్మర్‌లు పాల్గొన్నారని, అందులో షంషేర్ ఖాన్ అత్యంత ప్రతిభ కనబర్చి 5వ స్థానంలో నిలిచారని వివరించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయుడు, తెలుగువాడైన షంషేర్ ఖాన్ ఆర్థికంగా ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. షంషేర్ ఖాన్‌ను ఆర్థికంగా అదుకునేందుకు రాష్ట్ర మాస్టర్ స్విమ్మింగ్‌తో పాటు ఇతర జిల్లాల సంఘాల వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కానాల అంజని శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ తరుపున రూ.10,116 ఇస్తామన్నారు. భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ స్డేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, మాస్టర్ స్విమ్మింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బండ్లమూడి సుబ్బయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.