నయీమ్ (ఫైల్)
-
గతంలో నయీం అనుచరుడి అరెస్టు
-
ఇక్కడా భూ దందాలు
మంచిర్యాల సిటీ : మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ మహ్మద్ నయీమొద్దీన్ ఉరఫ్ నయీమ్ అడుగులు జిల్లాలోనూ పడ్డాయి. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నÄæూమ్ మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంతంలోనే అతడికి ఎక్కువ అనుచరులు ఉన్నట్టు సమాచారం. జన్నారం మండలం మందపెల్లి గ్రామానికి చెందిన ఒకరు నయీమ్‌కు అనుచరుడుగా పనిచేశాడు.
భూదందా కేసులో అతన్ని పదేళ్ల కిందట జిల్లా పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. పశ్చిమ ప్రాంతం కంటే తూర్పు ప్రాంతమైన కోల్‌బెల్ట్‌లోనే అతనికి ఎక్కువ స్థావరాలు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడికి సంబంధించిన అనుచరులు ఈ ప్రాంతం వారు ఉన్నప్పటికీ వారంతా ఎక్కువగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అతడి పేరుతో ఇక్కడ దాడులు చేయకుండా భూదందాలు చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి.
స్థావరాలు..
నయీమ్ 1980లో మావోయిస్టులో చేరాడు. దళంలో చురుగ్గా వ్యవహారించే అతను జూన్ 27, 1993లో ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను హైదరాబాద్‌లో ఎల్‌బీ స్టేడియంలో కాల్చి చంపాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నయీమ్ 2001లో అరెస్టు అయ్యాడు. హైదరాబాద్‌లోని కోర్టు తీర్పు వెలువడుతుండగానే అక్కడినుంచి తప్పించుకున్నాడు. అదే సమయంలో కోల్‌బెల్ట్ ప్రాంతాలైన శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో అతని స్థావరాలు ఏర్పడ్డాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి నుంచి కొద్ది›రోజులు నాగపూర్ ప్రాంతంలో కొద్ది రోజులు గడిపినట్టుగా సమాచారం.
అక్కడి నుంచే తన అరాచకాలను కొనసాగించాడు. తప్పించుకున్న తర్వాత నయీమ్ హైదరాబాద్ నుంచి నేరుగా కోల్‌బెల్ట్ ప్రాంతంతోపాటు నాగపూర్ వరకు రైలు ద్వారా ప్రయాణించే సౌకర్యం ఉండడంతో తన స్థావరాలతోపాటు అనుచరులను కూడా ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. అతని ఆచూకీ కోసం కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో గాలింపు చేపట్టినప్పటికీ చిక్కలేదు. ఇక్కడ తన అనుచరులను ఏర్పాటు చేసుకుని భూదందాలు, సెటిల్‌మెంట్లు కూడా చేశాడని పోలీస్ వర్గాలు పసిగట్టాయి. ఎక్కడ కూడ తన అనుచరులు పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలు హైదరాబాద్ నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాలకు వచ్చి విచారించినప్పటికీ ఫలితం కనిపించలేదు.
అతని అనుచరులుగా ముద్రపడ్డ వారంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారని, కాని ఇక్కడ వారు ఎలాంటి ప్రమాదకరమైన సంఘటనలకు మాత్రం పాల్పడలేదు. పదేళ్ల కిందట జన్నారం మండలం మందపల్లి నివాసిని నయీమ్ అనుచరుడిగా గుర్తించారు. భూదందా సంఘటనలోనే అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. మందపల్లి నివాసి మినహా నేటి వరకు అనుచరుల్లో ఎవ్వరు కూడా పోలీసులకు చిక్కకుండానే మిగిలిపోయారు.