నీరు–చెట్టు అవినీతిమయం
-
మూడో విడత నిధులు స్వాహాకు రంగం సిద్ధం
-
పనులకు కలెక్టర్ వద్ద ప్రతిపాదనలు
‘నీరు– చెట్టు’.. పసుపు చొక్కాల జేబులు నింపే పథకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల పనుల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఒకే పనిని నీరు–చెట్టు, ఉపాధి హామీ, ఎఫ్‌డీఆర్ పథకాలు కింద ఇలా.. అనేక మార్లు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో విడత స్వాహాకు తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) :
జిల్లాలో మొదటి విడతలో రూ.76.04 కోట్లతో 2,402 పనులు జరిగినట్లు అధికారులు లెక్కల్లో చూపారు. రెండో విడతలోనూ రూ.249.33 కోట్లతో 2,487 పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. అయితే ఈ పనుల్లో ఇరిగేషన్‌శాఖకు 30 శాతం పర్సంటేజ్‌లు, క్వాలిటీ కంట్రోల్‌కు, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌కు కలిపి మరో 10 శాతం చెల్లించి అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయలను స్వాహా చేశారని రైతు సంఘాల నాయకులు లోకాయుక్తను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అదే పనులు.. మూడో విడత
మొదటి రెండు విడతల్లో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి, నాయుడుపేట డివిజన్‌ల్లోనే మళ్లీ పనులను అధిక సంఖ్యలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. నీరు –చెట్టు కింద చేసిన పనులను ఉపాధి హామీలో, ఎఫ్‌డీఆర్‌లో చూపి అంతటితో ఆగకుండా సీఈ మంజూరుతో పనులు చేసిన ఘనత తెలుగు తమ్ముళ్లకే దక్కుతుంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా మరో 1500 పనులకు రూ.300 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వీటిపై ఎస్‌ఈ కోటేశ్వరరావును ఫోన్‌లో సంప్రదించగా ప్రస్తుతం మూడో విడత ప్రతిపాదనల అంశం, అధికారులపై క్రమశిక్షణ చర్యల విషయాలు కలెక్టర్ పరిశీలనలో ఉన్నాయని ముక్తాయించారు.
కలెక్టర్ వద్ద ప్రతిపాదనల ఫైల్
ఇరిగేషన్ అధికారుల ప్రమేయం లేకుండానే అధికార పార్టీ నాయకుల వాటాల పంపిణీకి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ముందుంచారు. అయితే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ముత్యాలరాజు విడతలు విడతలుగా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపినట్లు తెలుస్తోంది. సంబంధిత ప్రతిపాదనలను డ్వామా పీడీ హరిత స్వయంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
తమ్ముళ్ల ఆధిప్యత్యంలో అధికారులు బలి?
నీరు–చెట్టు పనుల కేటాయింపుల్లో తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో అధికారులు బలికానున్నారని తెలుస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు వేసేందకు మరో వర్గం ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే తమపై వేటు పడకముందే సెలవుపై వెళ్లాలని సంబంధిత అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.