
రూ.70 కోట్ల భూ కబ్జాకు టీడీపీ నేతల యత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్న శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి చెందిన రూ.70 కోట్లకు పైగా విలువైన 9.04 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు పాత మినీబైపాస్‌రోడ్డులోని నీలగిరి సంఘం సమీపంలో సర్వే నంబర్లు 171, 172లో 5.25 ఎకరాలు, సర్వే నంబరు 184లో 3.79 ఎకరాలు కలిపి మొత్తం 9.04 ఎకరాల భూమి రంగనాథస్వామి ఆలయానికి డమ్మాయి మాన్యం (పూర్వం ఆలయ భజంత్రీల జీవనానికి ఇచ్చిన భూమి)గా ఉంది.
ఈ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అంకణం భూమి రూ.లక్ష నుంచి మూడులక్షలు పలుకుతోంది. ఈ లెక్కన ఇది దాదాపు రూ.70 కోట్లు విలువ చేస్తుంది. ఆరేడేళ్ల కిందటి వరకు దీన్ని కొందరు రైతులు కౌలుకు చేసేవారు. చుట్టూ నివాసాలు ఏర్పడటం, సాగునీరందించే కాలువలు పూడిపోవడంతో కౌలుకు చేసేందుకు రైతులు ముందుకు రావడంలేదు. దీంతో ఈ భూమి తుంగతో నిండి మురుగుగుంతగా మారింది. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ఈ భూమి మీద మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రజాప్రతినిధి ఒకరు, టీడీపీకి చెందిన నియోజకవర్గస్థాయి మాజీ ప్రజాప్రతినిధి ఒకరు కన్నేశారు.
తమకు అనుకూలమైన పేదలనురంగంలోకి దించారు. ఐదంకణాల వంతున రంగనాథస్వామి భూమి కేటాయించేలా చేస్తామని, దుకాణాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని పురమాయించారు. ఆ భూమిలో కొంత భాగాన్ని రాత్రికిరాత్రి మట్టి, కంకరతో చదును చేయించారు. దీనిపై దేవాదాయశాఖ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి భూమి చుట్టూ కంచె నాటించి హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. సహాయ కమిషనర్ చర్యపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకేసినా ఇబ్బందులు తప్పవని బెదిరించారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు కబ్జాను అడ్డుకునే ప్రయత్నాలు ఆపేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సమయంలో కొంతమంది ఆ భూమి చుట్టూ వేసిన కంచెను కత్తిరించారు. ఈ భూమి రంగనాథస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు. ఈ కబ్జా వెనుక అధికారపార్టీ నేతలుండటంతో దేవాదాయశాఖ అధికారులు అడ్డుకునే ధైర్యం చేయలేకపోతున్నారు.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
పాత మినీ బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న 9.04 ఎకరాల భూమి రంగనాథస్వామికి చెందినదే. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.70 కోట్లు ఉంటుంది. ఈ స్థలాన్ని కొందరు మట్టిపోసి, చదును చేసి ఆక్రమణలకు యత్నించిన మాట వాస్తవమే. వారి ప్రయత్నాలను అడ్డుకున్నాం. రెండురోజుల కిందట మళ్లీ కబ్జాకు ప్రయత్నించినట్లు మా దృష్టికి రాలేదు. ఆక్రమణలకు ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
- వేగూరు రవీంద్రరెడ్డి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్