ఆధునిక బస్‌షెల్టర్లు రాబోతున్నాయి | new stles of busstops comming soon | Sakshi
Sakshi News home page

ఆధునిక బస్‌షెల్టర్లు రాబోతున్నాయి

Published Tue, Sep 6 2016 11:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఆధునిక బస్‌షెల్టర్లు రాబోతున్నాయి - Sakshi

ఆధునిక బస్‌షెల్టర్లు రాబోతున్నాయి

సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు కనీస సదుపాయాలతో కూడిన ఆధునిక బస్‌షెల్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. నగర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలు అందజేయడంలో భాగంగా ప్రభుత్వం అన్ని వసతులు కలిగిన బస్‌షెల్టర్‌లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. సురక్షితమైన తాగునీరు, టాయిలెట్లు, రాత్రి పూట చక్కటి లైటింగ్‌ సదుపాయం కలిగి ఉండి, బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసే ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఈ  బస్‌షెల్టర్‌లలో ఏర్పాటు చేస్తారు.

షెల్టర్ల ఏర్పాటులో  ఎలాంటి జాప్యానికి తావు లేకుండా శీఘ్రగతిన పూర్తి చేసేందుకు పర్యవేక్షణ బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)కి అప్పగించారు. నగరంలో బస్‌షెల్టర్‌ల దుస్థితిపై ఇటీవల జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ  సంయుక్త సర్వే నిర్వహించాయి.
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2300 బస్టాపులు ఉండగా, 1500 బస్టాపుల్లో మాత్రమే షెల్టర్‌లు ఉన్నాయి. 800 చోట్ల ప్రయాణికులు వర్షంలో తడుస్తూ, ఎండలో చెమటలు గక్కుతూ బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ప్రస్తుతం బస్‌షెల్టర్‌లు ఉన్న  వాటిలోనూ సగం వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల బస్‌షెల్టర్లు కబ్జాకు గురయ్యాయి. మరోవైపు మెట్రో రైలు నిర్మాణ పనుల దష్ట్యా చాలా చోట్ల షెల్టర్‌లను తొలగించారు. మొత్తంగా ఇప్పటికిప్పుడు 800 బస్టాపుల్లో షెల్టర్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట షెల్టర్‌లతో  పాటు, బస్‌బేలు కూడా  ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత రెండో దశలో శిథిలావస్థలో ఉన్న షెల్టర్‌లను పునరుద్ధరిస్తారు.
 

ఎల్‌ఈడీ బోర్డులు, వైఫై సదుపాయం...
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాలు, ప్రయాణికుల అవసరాలు, స్థలం లభ్యతకు అనుగుణంగా బస్‌షెల్టర్లలో సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.
►  తక్కువ స్థలం అందుబాటులో ఉన్న చోట ఒక పోల్‌ ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలపై సైనేజీ బోర్డు  ప్రదర్శిస్తారు. స్థలం ఎక్కువ ఉన్న చోట, ప్రయాణికుల రాకపోకలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఆ రూట్‌లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలు, టైమింగ్స్‌ ఎప్పటికప్పుడు డిస్‌ప్లే చేస్తారు.
►    తక్కువ స్థలం అందుబాటులో ఉన్న షెల్టర్‌లలో ఒక స్ట్రీట్‌ లైట్‌ ఏర్పాటు చేస్తారు. ఎక్కువ స్థలం ఉన్న చోట  షెల్టర్‌ లోపలి వైపు కూడా లైట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే అవకాశం ఉన్న చోట సోలార్‌లైట్లను ఏర్పాటు చేస్తారు.
పర్యావరణ హితంగా...
►    అన్ని బస్‌షెల్టర్‌లు పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌పాత్, సైడ్‌ వాక్‌ సదుపాయంతో పాటు స్థలం లభించిన చోట వీటితో పాటు బస్‌షెల్టర్‌ చుట్టూ మొక్కలు నాటుతారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటారు. పై కప్పును సైతం పచ్చదనంతో కప్పేస్తారు.
►     అన్ని రకాల వాతావరణాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొనేవిధంగా నాణ్యమైన బెంచీలను ఏర్పాటు చేస్తారు. ఫుల్‌వాల్‌కు 4 నుంచి 5 ఫీట్ల దూరం ఉండేవిధంగా సీట్లు ఏర్పాటు చేస్తారు. మహిళల కోసం ప్రత్యేక సీట్లు కూడా ఉంటాయి.
►    మ్యాపులు, డిస్‌ప్లేబోర్డులతో పాటు, వైఫై సదుపాయం కూడా ఉంటుంది.
►    సురక్షితమైన తాగునీరు, అవకాశం ఉన్న చోట్ల టాయిలెట్లు, తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెల్టర్లు...
బస్టాపుల ప్రాధాన్యత, ప్రయాణికుల రద్దీ, అందుబాటులో ఉన్న స్థల విస్తీర్ణానికి అనుగుణంగా బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌ (మియాపూర్‌), కేపీహెచ్‌బీ 4వ ఫేజ్, కూకట్‌పల్లి, భరత్‌నగర్, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్, దారుల్‌షిఫా, ఉస్మాన్‌గంజ్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, అశోక్‌నగర్, చింతల్‌కుంట, భాగ్యలత కాలనీ (హయత్‌నగర్‌), యూసుఫ్‌గూడ బస్తీ, వేవ్‌రాక్, మాదాపూర్, ఉప్పల్, అంబర్‌పేట్‌ ఆలీకేఫ్, ఆల్విన్‌కాలనీ, పద్మారావునగర్, బోయిన్‌పల్లి, కొంపల్లి, మేడ్చెల్, ఎల్‌బీనగర్‌ కామినేని, ఆలియాబాద్, పహాడీషరీఫ్‌ తదితర ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు నిర్మిస్తారు.

కూకట్‌పల్లి, ఈఎస్‌ఐ, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, మాసాబ్‌ట్యాంక్‌ ఎన్‌ఎండీసీ, మెహదీపట్నం సరోజనీదేవి ఆసుపత్రి, నానల్‌నగర్, బాపూనగర్, లక్డీకాపూల్‌(హోటల్‌ అశోకా), నాంపల్లి గాంధీభవన్, లోతుకుంట తదితర ప్రాంతాల్లో బస్‌బేలు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement