♦ రిజర్వాయర్ సామర్థ్యం
♦ 50 టీఎంసీలకు పెంచడంతో మారిన అంచనా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమురవెల్లి మల్లన్నసాగర్(తడ్కపల్లి) రిజర్వాయర్ నిర్మాణానికి కొత్తగా టెండర్లు పిలవాలని నీటి పారుదల శాఖ దాదాపు నిర్ణయానికి వచ్చింది. రిజర్వాయర్ స్వరూపం పూర్తిగా మారడం, సామర్థ్యం ఏకంగా ఒక టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పూర్తిగా కొత్త కాంట్రాక్టర్‌కే దీని పనులు అప్పగించాలని భావిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు వచ్చిన అనంతరం దీనిపై తుది నిర్ణయం చేయనుంది. 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, సిద్ధిపేట లోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్(పాములపర్తి)ని 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం చేసింది.
ఇందులో ఇప్పటికే పాములపర్తి రిజర్వాయర్ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించారు. మల్లన్నసాగర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం చేయలేదు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్న ప్యాకేజీ 12ను ప్రస్తుతం రెండుగా విభజించారు. ఇందులో 12(ఎ)లో ప్రధాన కాల్వలు, ఇతర డిస్ట్రిబ్యూటరీల వాస్తవ నిర్మాణ వ్యయం అంచనా రూ. 1,864 కోట్లు ఉండగా, అది మారిన పనుల కారణంగా మరో రూ. 1,550.52 కోట్లు పెరిగింది. దీనికి తోడు ప్యాకేజీ 12 (బి)లో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ నిర్మాణ వ్యయాన్ని వేరుగా అధికారులు లెక్కగట్టారు. ఈ అంచనా వ్యయం విలువ రూ. 5,734.45గా తేలింది. ఇందులో డిస్ట్రిబ్యూటరీ, కాల్వలకు సంబంధించిన పెరిగిన వ్యయానికి సంబంధించిన పనులను సైతం పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలనే యోచనలో ఉంది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి మాత్రం కొత్తగా టెండర్లు పిలిచి అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు ఈ నెల 19 తర్వాతే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.