విరాట్‌ పోయి..టీయూ వచ్చె.. | New Troubles for fighter aircraft museum | Sakshi
Sakshi News home page

విరాట్‌ పోయి..టీయూ వచ్చె..

Published Tue, Mar 14 2017 8:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ విమాన వాహక యుద్ధనౌక - Sakshi

పరువు కోసం ప్రభుత్వం పాకులాట
యుద్ధ విమాన మ్యూజియం కోసం కొత్త తంటా


విశాఖపట్నం : రెండేళ్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొడుతున్న విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ మ్యూజియం కొండెక్కేసింది. రూ.వెయ్యి కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్య తలెత్తడంతో మంగళం పాడేసింది. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా విరాట్‌ను విశాఖ తీరంలో మ్యూజియం కమ్‌ స్టార్‌ హోటల్‌గా తీర్చిదిద్దుతున్నట్టు విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రపంచంలోనే అతి పురాతన, అతి పెద్ద విమాన వాహక యుద్ధనౌకగా గుర్తింపు పొందిన ఈ విరాట్‌ను డీ–కమిషన్‌ (నేవీ సేవల నుంచి విరమణ) చేశాక ఆంధ్రప్రదేశ్‌కే కేటాయిస్తారంటూ పదేపదే చెబుతూ వచ్చారు.

కేంద్రం ప్రకటించకున్నా నిపుణులతో కమిటీలు
ఈ విరాట్‌ కోసం మహారాష్ట్ర, గుజరాత్, గోవా తదితర రాష్ట్రాలు పోటీపడ్డాయి. ఈ మూడు రాష్ట్రాలు ఆర్థికంగా ఎంతో బాగున్నాయి. అయినప్పటికీ కేంద్రంలో చంద్రబాబుకున్న పలుకుబడితో విరాట్‌ మనకే ఇవ్వడానికి రక్షణ మంత్రిత్వశాఖ అంగీకరించిందని, డీకమిషన్‌ చేయడమే తరువాయి.. అని మంత్రులు పలుమార్లు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం గాని, రక్షణ మంత్రిత్వశాఖ గాని, నేవీ వర్గాలు గాని విరాట్‌ యుద్ధనౌకను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తున్నట్టు ఏనాడూ ప్రకటించలేదు. అయినప్పటికీ విరాట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీలపై కమిటీలు వేసింది.

ఆ బాధ్యతను విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు అప్పగించింది. తొలుత భీమిలి నుంచి ఆర్కే బీచ్‌ మధ్యలో ఉన్న పదికి పైగా ప్రాంతాలను పరిశీలించింది. వీటిలో లాసన్స్‌బే కాలనీ, తెన్నేటి పార్కు, భీమిలి తదితర తీర ప్రాంతాలు అనుకూలమని ఓ నివేదిక ఇచ్చారు. కొన్నాళ్లు హడావుడి చేశాక కొత్తగా యారాడ బీచ్‌ను పరిశీలిస్తున్నట్టు ఇటీవల మరో ప్రచారం జరిగింది. ఇలా అదిగో విరాట్, ఇదిగో విరాట్‌ అంటూ వీలు చిక్కినప్పుడల్లా విశాఖ వాసుల్ని మోసం చేస్తూ వచ్చారు.

ఇక టీయూ 142 వంతు
ఇంతలో ఈ నెల 29న నేవీ సేవల నుంచి నిష్క్రమించనున్న నిఘా, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానం టీయూ 142పై ప్రభుత్వం కన్నేసింది. దీనిని విశాఖ వుడా పార్కు వద్ద మ్యూజియంగా ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ యుద్ధ విమాన మ్యూజియానికి ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే సాగరతీరంలో కురుసుర జలాంతర్గామి మ్యూజియం ఉంది. ఇది ప్రజాదరణ పొందుతోంది. దాని మాదిరిగానే ఈ టీయూ 142 యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. అయితే ఈ యుద్ధ విమానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించినట్టు రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ టెండర్ల ప్రక్రియకు నడుం బిగించింది.

రూ. వెయ్యి కోట్లకు పెరిగిన అంచనాలు
తొలుత విరాట్‌ను మ్యూజియం కమ్‌ స్టార్‌ హోటల్‌గా మార్చడానికి రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అది ఈ రెండేళ్లలో అంచెలంచెలుగా రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగబాకింది. ప్రభుత్వం వద్ద నిధుల్లేని పరిస్థితి నెలకొంది. అలాంటిది వెయ్యి కోట్లను ఎలా సమకూర్చాలో దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వం పడింది. విరాట్‌ మ్యూజియానికి వెచ్చించే సొమ్ముతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. ఒక్క దానిపైనే ఇంత సొమ్ము వెచ్చించడంపైనా సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 6న ఈ విరాట్‌ యుద్ధనౌక నేవీ సేవల నుంచి నిష్క్రమించింది. త్వరలోనే విశాఖ వచ్చేస్తుందనుకుంటున్న తరుణంలో ఇక విరాట్‌ ప్రాజెక్టు ఏర్పాటు ఆసాధ్యమని గుర్తించి ప్రభుత్వం చేతులెత్తేసింది.




టీయూ–142 యుద్ధ విమానం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement