నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు
Published Mon, Jul 10 2017 11:44 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టులో సర్వం పోగొట్టుకుంటున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు పరిహారంతో పాటు పలు వివాదాలను కూడా ప్రభుత్వం అంటగడుతోంది. వారికి ఇచ్చిన భూముల్లో పంట తీసుకు వెళ్ళాలన్నా లేదా కౌలుకు ఇచ్చుకోవాలన్నా స్థానిక గిరిజనులతో పోరాటం చెయ్యాల్సిందే. నిర్వాసితులు స్థానిక గిరిజనుల మధ్య జరుగుతున్న వివాదాలతో నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు పారుతున్నాయి.
జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసిత గ్రామాలు అయిన ఎర్రవరం, శివగిరి, టేకూరు, కొరుటూరు, గాజుల గొంది, చీడూరు, కటుకూరు గ్రామాల గిరిజనులకు 12 సర్వే నంబర్లలో 500 ఎకరాల భూమిని 2014 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుండి ఈ భూముల్లో నిర్వాసితులు సాగు చేసుకోవాలన్నా.. కౌలుకు ఇచ్చుకోవాలన్నా ప్రతి సంవత్సరం స్థానిక గిరిజనులతో వివాదాలు ఏర్పడుతున్నాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్న వారిపై కేసుల నమోదు చేయడం జరుగుతోంది.
500 ఎకరాల భూమిపై ఎన్నో ఉద్యమాలు
పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసితులకు కేటాయించిన అయిదు వందల ఎకరాల భూమి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూ ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈ భూమిపైనే సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి అనేక మంది నాయకులు అయ్యారు. ఉద్యమ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ భూమి గిరిజనులకు ఇప్పించడానికి పోరాటం చేశారు. దీనిలో కొంత భూమిలో గిరిజనులకు పట్టాలు కూడా వచ్చాయి. దీంతో మిగిలిన గ్రామాలకు చెందిన వారు కూడా ఈ భూములపై పోరాటం చేస్తే తమకు ఎంతోకొంత భూమి దక్కుతుందని ఆశతో ఉన్నారు. స్థానిక గిరిజనులు అప్పటి నుండి పోరాటాలు చేసూ్తనే ఉన్నారు. ఈ అయిదు వందల ఎకరాల భూమి చాగల్లు గ్రామానికి చెందిన 17 మందితో కూడిన ఫరంకు సంబంధించిన భూమి. ఈ భూమిలో మామిడితోట ఉండేది. రికార్డు అంతా వారికి అనుకూలంగా ఉన్నా గత 30 సంవత్సరాల కాలంలో ఇక్కడ వారు సాగు చేసిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం మామిడి కాయలు తీసుకు వెళ్ళడానికి స్థానిక గిరిజన నాయకులకు ఎంతో కొంత ముట్ట చెప్పి కాయలను అమ్ముకునే వారు. లేదా తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి చివరకు పోలీస్ రక్షణతో వారు పంటను తీసుకు వెళ్ళేవారు. 2014 సంవత్సరంలో ఈ భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంతో చాగల్లు ఫరం ప్రతినిధులు ఈ భూమిపై సొమ్ములు చేసుకోగా వారు పడిన బాధలు ఇప్పుడు ప్రతి సంవత్సరం నిర్వాసితులు పడుతున్నారు.
కౌలు పంచాయితీలే వివాదాలకు కారణం
నిర్వాసితుల భూమిలో వివాదాలకు ప్రధానంగా భూమి కౌలు పంచాయితీలే కారణమవుతున్నాయి. నిర్వాసితులకు కేటాయించిన భూములను వారు ప్రస్తుతం ఇక్కడకు వచ్చి సాగు చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ భూములను స్థానికంగా ఉన్న కొందరు గిరిజనుల ఆధ్వర్యంలో గుత్త బేరంగా కౌలుకు ఇచ్చేస్తున్నారు. వీటిని తక్కువ కౌలుకు తీసుకుని ఎక్కువ కౌలుకు బయట వ్యక్తులకు ఇస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న గిరిజనుల మధ్య వివాదాలు వస్తున్నాయి. నిర్వాసితుల కౌలు సొమ్ములు కొందరే తినడం ఏంటి మేము గిరిజనులం కాదా అని వీరు నిర్వాసిత భూముల్లోకి అడ్డంగా వెళుతున్నారు. దీంతో ఇక్కడ వివాదాలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం భూమి ఇచ్చేశాం కొట్టుకుచావండన్నట్లుగా చూస్తూ ఊరుకోవడంతో ప్రతిసారి ఈ వివాదాలు సర్వసాధారణంగా మారాయి. భవిష్యత్‌లో ఇవి మరింత ఎక్కువ కాకముందే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలి్స న అవసరం ఉంది.
Advertisement
Advertisement