మూడు సెంట్లు ఏమూలకు..
మూడు సెంట్లు ఏమూలకు..
Published Fri, Jun 2 2017 12:47 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
వేలేరుపాడు : పచ్చని చెట్ల నడుమ.. విశాలమైన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ప్రశాంతంగా బతికిన వారంతా ప్రభుత్వ పుణ్యమా అని ఇరుకు జాగాల్లో మగ్గాల్సిన దుస్థితి తలెత్తు తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 29,545 కుటుంబాలు నిర్వాసితుల జాబితాలోకి చేరాయి. ఇందులో 10 వేల వరకు గిరిజన కుటుంబాలు కాగా.. మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు. ఈ రెండు మండలాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిలోకి చేరడంతో వీరంతా సర్వస్వం కోల్పోయి.. అగ్నిప్రమాద బాధితుల తరహాలో కట్టుబట్టలతో బయటకు రావాలి్సన పరిస్థితి ఏర్పడుతోంది. ముంపు మండలాల్లోని ఏ గ్రామంలో చూసినా పేద, గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి కుటుంబం కనీసం 25 సెంట్ల స్థలంలో తమ స్థాయిని బట్టి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉటోంది. ఇంటి పెరట్లోనే కూరగాయలు పండించుకుంటున్నారు. పండ్ల మొక్కలను సైతం పెంచుకుని ఫలసాయం అనుభవిస్తున్నారు. పశువుల్ని పెంచుకుంటూ.. వాటిని పాకల్లో సంరక్షించుకుంటూ ఎంతోకొంత ఆదాయం పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వీరంతా స్వగ్రామాలను, సొంత ఇళ్లను వదులుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూడు సెంట్ల జాగాలో మగ్గిపోవాలట
ప్రశాంత వాతావరణంలో.. విశాలమైన ఇళ్లలో జీవించిన గిరిజన కుటుంబాలకు 5 సెంట్లు, గిరిజనేతర కుటుం బాలకు 3 సెంట్ల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గిరిజనేతరులకు పట్టణ ప్రాంతాల్లో నివాసం కల్పిం చాల్సి ఉండటంతో వారికి 3 సెంట్ల ఇంటి స్థలం ఉండేలా కాలనీ నిర్మించి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నిర్ణయంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే.. గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంటి ప్రాంగణంలో ధాన్యం గరిసెలు, దుక్కిటెడ్లు, పాడి పశువులు ఉంచుతారు. ప్రభుత్వం కేటాయించే ఐదు సెంట్ల భూమిలో ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం కష్టసాధ్యమని గిరిజనులు వాపోతున్నారు. కనీసం గిరిజనులకు 8 సెంట్లు, గిరిజనేతరులకు 5 సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించాలని నిర్వాసితులు కోరుతున్నారు.
ఎలా ఉండగలం
సర్వం వదులుకుని సొంతూరు నుంచి పునరావాస ప్రాంతానికి వెళ్తున్నాం. గిరిజనులకు ప్రభుత్వం 5 సెంట్ల భూమి ఇస్తుందట. ఆ జాగాలో అన్ని వసతులు కల్పించుకోవడం కష్టం. మా దుక్కెటెడ్లు, పాడి పశువులు, మేకలు, ధాన్యం గరిసెలు లేకపోతే ఎలా జీవించగలం. గిరిజనులకు 8 సెంట్ల జాగా అయినా ఇవ్వాలి.
– కొవ్వాసి ధనలక్ష్మి, సర్పంచ్, కట్కూరు
ప్రశాంతంగా బతకనివ్వరా
ఎకరం స్థలంలో విశాలమైన ఇంటిని నిర్మించుకున్నాం. మా కుటుంబమంతా ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మా పెరట్లో అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే మూడు సెంట్ల స్థలంలో ఎలా ఉండగలం. ప్రభుత్వానికిది న్యాయమేనా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా.
– కోటా రమేష్‌బాబు, రైతు, వేలేరుపాడు
ఐదు సెంట్లు ఇవ్వాలి
గిరిజనేతరులకు ప్రభుత్వం ప్రకటించిన మూడు సెంట్ల ఇంటిస్థలం ఏ మూలకూ సరిపోదు. అంత చిన్న విస్తీర్ణంలో ఎలా నివాసం ఉండగలం. కనీసం ఐదు సెంట్లు ఇవ్వాలి. పశువుల పాకలకు స్థలమివ్వాలి.
– వలపర్ల రాములు, వేలేరుపాడు
Advertisement
Advertisement