RR PACKAGE
-
సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్..
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోలవరం నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు సీఎం అండగా నిలిచారన్నారు. వారికి నివాసం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయనే స్వయంగా గృహ ప్రవేశం చేయించడంతో నిర్వాసితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ జగన్ అండగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. కాలనీలో మరికొన్ని సౌకర్యాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ స్వయంగా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని.. నమ్మలేకపోయామని నిర్వాసితులు అన్నారు. సీఎం జగన్ వస్తే నా పెద్దకొడుకే వచ్చినట్లు ఉందని వృద్ధురాలు అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని.. సీఎం జగన్ అండగా నిలిచారన్నారు. చదవండి: మాట నిలబెట్టుకుంటాం: సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సందర్శించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఇందుకూరు-1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులను కలుసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
వేటు పడింది
తూర్పుగోదావరి, తుని రూరల్ (తుని): పోలవరం ప్రధాన ఎడమ కాలువ నిర్వాసితులు కుమ్మరిలోవ కాలనీవాసుల ఆర్ఆర్ ప్యాకేజీలో అక్రమాలకు బాధ్యులైన ఆర్ఐ, వీఆర్వోలపై వేటు పడింది. సెప్టెంబరు పదిన ‘సాక్షి’లో ‘‘బినామీ తమ్ముళ్ల స్వాహాపర్వం!’’ శీర్షికన ప్రచురితమైన కథనం అప్పుడే తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు వీఆర్వో, ఆర్‌ఐలపై వేటు వేసి, బినామీ తమ్ముళ్ల స్వాహా పర్వానికి అడ్డుకట్టు వేశారు. మంగళవారం తుని మండలం కుమ్మరిలోవ వచ్చిన జాయింట్ కలెక్టర్ మల్లికార్జున బాధిత నిర్వాసితుల వాదనలు, అందించిన ఆధారాలను పరిశీలించారు. ప్రాథమికంగా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి వీఆర్వో సాయిబాబా, ఆర్ఐ కార్తీక్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మల్లికార్జున విలేకర్లతో మాట్లాడారు. ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరైన జాబితాలో మొదట, చివరి పేజీలను ఉంచి, మధ్య పేజీల్లో పేర్లు మార్పు చేసి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. ఉన్నత అధికారులను సైతం తప్పుదారి పట్టించినట్టు పేర్కొన్నారు. నిర్వాసితులు డిమాండ్ మేరకు అనర్హులుగా భావిస్తున్న 29 మంది పేర్లను తొలగించడంతో పాటు అర్హులైన మరో 65 మందికి న్యాయం చేసేందుకు సమగ్ర విచారణ చేస్తామన్నారు. ఇందుకుగాను వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు చొప్పున తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలతో మూడు ప్రత్యేక బృందాలను నియమిస్తామన్నారు. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు. డిసెంబరు నెలాఖరుకి పునరావాసం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు అప్పగిస్తామన్నారు. సొంతంగా నిర్మించునే లబ్ధిదారుల ఇళ్లను పర్యవేక్షిస్తామన్నారు. పోలవరం కాలువ నిర్మాణం సకాలంలో పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్డీఓ సమక్షంలో నిర్వాసితులపై దాడికి యత్నం, తోపులాట జాయింట్ కలెక్టరు వస్తుండడంతో కుమ్మరిలోవ కాలనీ నిర్వాసితుల పునరావాస కల్పన ప్రాంతానికి పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న నిర్వాసితులను నష్టం ఎలా జరిగింది? ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారు? అంటూ ప్రశ్నించిన ఆర్డీఓ ఇరువర్గాలు అవగాహనకు వచ్చి రాజీపడండి, లేదంటే విచారణ చేస్తే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. అప్పటికే చుట్టముట్టి ఉన్న బినామీ తమ్ముళ్ల ఒక్కసారిగా రెచ్చిపోయి బాధిత నిర్వాసితులపై దాడికి యత్నించారు. బాధితులుసైతం తిరగబడడంతో తోపులాట జరిగింది. దీంతో ఆర్డీఓ అక్కడి నుంచి దూరంగా వెళ్లి నిర్మాణంలో ఉన్న కట్టడాలను పరిశీలించారు. కొంతసేపటికి తోపులాట సద్దుమణగడం, అదే సమయానికి సంఘటన స్థలానికి జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, బందోబస్తుకు రూరల్ పోలీసులు చేరుకున్నారు. బాధిత నిర్వాసితుల డిమాండ్లను, ఆరోపణలు విన్న జేసీ అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని, అర్హులకు విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరీకి నష్టపరిహారంతో పాటు ఆర్ఆర్ ప్యాకేజీ అందిస్తామన్నారు. వీఆర్వో, ఆర్ఐలను సస్పెండ్ చేసినట్టు ప్రకటించడంతో బాధిత నిర్వాసితులు శాంతించారు. త్రుటిలో తప్పిన సస్పెన్షన్ ఇళ్ల నిర్మాణం, ఆర్ఆర్ ప్యాకేజీ నివేదిక తయారీలో మొదట సంతకం చేసిన పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సస్పెన్షన్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీఆర్వో, ఆర్ఐతో పాటు కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్టు జేసీ మల్లికార్జున ప్రకటించారు. అక్కడే ఉన్న కార్యదర్శి సత్యనారాయణను వివరణ కోరారు. కార్యదర్శిగా చేరిన కొత్తలో ఈ వ్యహరం జరిగిందని, గ్రామ కమిటీ నివేదిక పేరుతో నా వద్ద సంతకాలు తీసుకున్నట్టు కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. అలా చేసిన సంతకాల నివేదికనే ఆర్ఆర్ ప్యాకేజీకి పంపించడంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని, తన వాదనను కార్యదర్శి వినిపించాడు. దీనిని గమనించిన జేసీ తొలి తప్పిదంగా హెచ్చరించడంతో సస్పెన్షన్ వేటునుంచి కార్యదర్శి సత్యనారాయణ బయటపడ్డాడు. జరిగింది ఇదీ... పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం మండలంలో 18 కిలో మీటర్ల పొడవునా జరుగుతోంది. ప్రధానంగా కుమ్మరిలోవ కొండపై నుంచి తాండవ చక్కెర కర్మాగారం వెనుక కొండకు తాండవ నది అక్విడెక్టు నిర్మించాల్సి ఉంది. ఇందుకు కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై భారీ తవ్వకాలు చేయాల్సి ఉంది. భారీ తవ్వకాల్లో బండరాళ్లు ఎగిరిపడే ప్రమాదం ఉంది. అలా ఎగిరిపడే వచ్చే బండరాళ్లు కాలనీ ఇళ్లపై, ప్రజలపై పడితే ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో కుమ్మరిలోవకాలనీని తొలగించేందుకు ప్రతిపాదనలు చేశారు. కాలనీని తరలించేందుకు, నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ప్రతిపాదించారు. కాలనీలోఉన్న 315 ఇళ్లను తొలగించి, ప్రత్యామ్నాయంగా దుద్దికలోవలో పునరావాస కాలనీ నిర్మించనున్నారు. ఈ క్రమంలో 315 మంది బాధితుల పేర్లలో కొంతమంది పేర్లను తొలగించి, స్థానే బినామీ పేర్లను నమోదు చేశారు. నమోదు చేసిన పేర్లకు వచ్చే ఆర్ఆర్ ప్యాకేజీ రూ.మూడు కోట్లకుపైగా మొత్తాలను పంచుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. ఈ అక్రమాన్ని వెలుగులోకి తెస్తూ సెప్టెంబర్ పదిన ‘సాక్షి’లో ‘పచ్చ రాబందులు, బినామీ తమ్ముళ్ల స్వాహాపర్వం! శీర్షిక న కథనాన్ని ప్రచురించింది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. తమకు న్యాయంగా దక్కాల్సిన పరిహారాన్ని నాయకులు దోచుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొంతమంది తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారానే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధిత నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు. -
పర్యాటకశాఖకు రైల్వే షాక్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంటేనే పర్యాటకుల స్వర్గధామం.. ప్రకృతి రమణీయతతో పులకరింపజేసే మన్యం అందాలు అదనపు ఆభరణం.. వాటిని ఆస్వాదించడానికి దేశవిదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో అధికశాతం టూరిస్టులు అరకు ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పర్యాటకశాఖ గతంలోనే అరకుకు రైల్ కం రోడ్డు (ఆర్ఆర్) ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో విశాఖ నుంచి ఉదయం 7 గంటలకు కిరండూల్ పాసింజర్ రైలులో అరకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సులో రాత్రి నగరానికి తీసుకొస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.960 వసూలు చేస్తోంది. విశాఖ నుంచి అరకు 128 కిలోమీటర్ల దూరం ఉంది. మార్గంమధ్యలో లోతైన లోయలు, ఎత్తయిన పర్వతశ్రేణులు, దిగువన గలగల పారే సెలయేళ్లు, కొండలపై నుంచి జలజల పారే జలపాతాలు కనువిందు చేస్తాయి. మధ్యమధ్యలో పచ్చని పొలాలు, వంపులు తిరుగుతూ వెళ్లే రైలు నుంచి అగుపిస్తాయి. మార్గంమధ్యలో పొడవైన గుహల్లోని రైలు దూసుకుపోతుంటే పర్యాటకులు ఎంతో తీయని అనుభూతి పొందుతారు. ఇలా నాలుగు గంటలపాటు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ మైమరచిపోతుంటారు. తిరుగు ప్రయాణంలో పర్యాటకశాఖ బస్సుల్లో బొర్రాగుహలు, టైడా జంగిల్‌బెల్స్ వంటి పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఇలా ఇటు రైలు మార్గం, అటు బస్సు రూటు ద్వారా అందాలను తనివి తీరా ఆస్వాదించే అవకాశం ఉండడం వల్ల ఆర్ఆర్ ప్యాకేజీకి ఎంతో డిమాండ్ ఉంది. మోకాలడ్డిన రైల్వే.. ఈ తరుణంలో ఈ రైలులో పర్యాటకులను రిజర్వేషన్లు లేకుండా అనుమతించబోమంటూ ఆరు నెలల క్రితం రైల్వేశాఖ అభ్యంతరం చెప్పింది. ఇన్నాళ్లూ ఈ కిరండూల్ పాసింజర్లో ఒక బోగీని పర్యాటకశాఖ సిబ్బంది అనధికారికంగా ఆక్రమించుకుని అందులో ఆర్ఆర్ ప్యాకేజీ తీసుకున్న పర్యాటకులను ఎక్కించేవారు. దీనికి రైల్వే అధికారులు బ్రేకులు వేయడంతో ఆర్ఆర్ ప్యాకేజీని అర్థాంతరంగా నిలిపేయాల్సి వచ్చింది. ఆర్ఆర్ ప్యాకేజీని ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే పర్యాటక అధికారులు వెనువెంటనే దానిని తొలగించక పోవడంతో కొంతమంది ఆన్లైన్లో ఈ ప్యాకేజీని బుక్ చేసుకునేవారు. తీరా ఇక్కడకు వచ్చాక రైలు సదుపాయం లేదని చెప్పడంతో పర్యాటకశాఖ సిబ్బందికి, పర్యాటకులకూ వాగ్వాదాలు చోటు చేసుకునేవి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇటీవలే ఆన్లైన్ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో విశాఖలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీసులో విధులు నిర్వహించే జనరల్ హెల్పర్లు పనిలేకుండా ఉన్నారు. ఎడతెగని ప్రయత్నాలు.. ఈ పరిస్థితుల్లో అప్పట్నుంచి పర్యాటకశాఖ అధికారులు రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. రోజుకు తమకు ప్రత్యేకంగా ఒక బోగీ కేటాయించాలని వీరు కోరుతున్నారు. ఇందుకు రైల్వే అధికారులు రూ.40 వేలు అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక్కో పర్యాటకునికి సగటున రూ.500 చొప్పున చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఇది భారమని, అద్దె తగ్గించాలని చేస్తున్న విజ్ఞప్తికి ఇంకా స్పందన రాలేదు. మరోవైపు సెప్టెంబర్ నుంచి బెంగాలీ పర్యాటకుల సీజను మొదలవుతుంది. రోజూ పెద్ద సంఖ్యలో మూడు నెలల పాటు అరకు పర్యటనకు వెళ్తుంటారు. వీరంతా ఆర్ఆర్ ప్యాకేజీకే మొగ్గు చూపుతారు. పర్యాటక శాఖ హోటళ్లలో బస చేస్తారు. ఇది టూరిజం శాఖకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఆర్ఆర్ ప్యాకేజీని పునరుద్ధరిస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ డివినల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. బస్సు ప్యాకేజీపై అసంతృప్తి అప్పట్నుంచి ఏజెన్సీకి పర్యాటకులను ఈ ప్యాకేజీలో బస్సులో తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. దీంతో వీరు రానూపోనూ చూసిన అందాలనే చూడాల్సి వస్తోంది. రైలు మార్గంలో కనిపించే అందాలన్నీ అగుపించడం లేదు. దీంతో టూరిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్యాకేజీకి ఆసక్తి చూపకపోవడంతో వీరి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆర్ఆర్ ప్యాకేజీలో రోజుకు సగటున 90 మంది వరకు వెళ్లే వారు. తిరుగు ప్రయాణంలో రావడం కోసం వీరికి మూడు బస్సులను కేటాయించేవారు. ఇప్పుడా సంఖ్య 20–25 కూడా ఉండడం లేదు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపలేక, వారిని తీసుకెళ్లలేక సతమతమయ్యే పరిస్థితి తలెత్తుతోంది. పర్యాటకులు తగ్గిపోవడంతో ఆ శాఖకు ఆదాయం బాగా పడిపోయింది. -
నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టులో సర్వం పోగొట్టుకుంటున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు పరిహారంతో పాటు పలు వివాదాలను కూడా ప్రభుత్వం అంటగడుతోంది. వారికి ఇచ్చిన భూముల్లో పంట తీసుకు వెళ్ళాలన్నా లేదా కౌలుకు ఇచ్చుకోవాలన్నా స్థానిక గిరిజనులతో పోరాటం చెయ్యాల్సిందే. నిర్వాసితులు స్థానిక గిరిజనుల మధ్య జరుగుతున్న వివాదాలతో నిర్వాసితుల భూముల్లో నెత్తుటి ధారలు పారుతున్నాయి. జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసిత గ్రామాలు అయిన ఎర్రవరం, శివగిరి, టేకూరు, కొరుటూరు, గాజుల గొంది, చీడూరు, కటుకూరు గ్రామాల గిరిజనులకు 12 సర్వే నంబర్లలో 500 ఎకరాల భూమిని 2014 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుండి ఈ భూముల్లో నిర్వాసితులు సాగు చేసుకోవాలన్నా.. కౌలుకు ఇచ్చుకోవాలన్నా ప్రతి సంవత్సరం స్థానిక గిరిజనులతో వివాదాలు ఏర్పడుతున్నాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్న వారిపై కేసుల నమోదు చేయడం జరుగుతోంది. 500 ఎకరాల భూమిపై ఎన్నో ఉద్యమాలు పి.నారాయణపురం గ్రామంలో పోలవరం నిర్వాసితులకు కేటాయించిన అయిదు వందల ఎకరాల భూమి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూ ఉద్యమాలకు పుట్టినిల్లు. ఈ భూమిపైనే సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి అనేక మంది నాయకులు అయ్యారు. ఉద్యమ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ భూమి గిరిజనులకు ఇప్పించడానికి పోరాటం చేశారు. దీనిలో కొంత భూమిలో గిరిజనులకు పట్టాలు కూడా వచ్చాయి. దీంతో మిగిలిన గ్రామాలకు చెందిన వారు కూడా ఈ భూములపై పోరాటం చేస్తే తమకు ఎంతోకొంత భూమి దక్కుతుందని ఆశతో ఉన్నారు. స్థానిక గిరిజనులు అప్పటి నుండి పోరాటాలు చేసూ్తనే ఉన్నారు. ఈ అయిదు వందల ఎకరాల భూమి చాగల్లు గ్రామానికి చెందిన 17 మందితో కూడిన ఫరంకు సంబంధించిన భూమి. ఈ భూమిలో మామిడితోట ఉండేది. రికార్డు అంతా వారికి అనుకూలంగా ఉన్నా గత 30 సంవత్సరాల కాలంలో ఇక్కడ వారు సాగు చేసిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం మామిడి కాయలు తీసుకు వెళ్ళడానికి స్థానిక గిరిజన నాయకులకు ఎంతో కొంత ముట్ట చెప్పి కాయలను అమ్ముకునే వారు. లేదా తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి చివరకు పోలీస్ రక్షణతో వారు పంటను తీసుకు వెళ్ళేవారు. 2014 సంవత్సరంలో ఈ భూమిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంతో చాగల్లు ఫరం ప్రతినిధులు ఈ భూమిపై సొమ్ములు చేసుకోగా వారు పడిన బాధలు ఇప్పుడు ప్రతి సంవత్సరం నిర్వాసితులు పడుతున్నారు. కౌలు పంచాయితీలే వివాదాలకు కారణం నిర్వాసితుల భూమిలో వివాదాలకు ప్రధానంగా భూమి కౌలు పంచాయితీలే కారణమవుతున్నాయి. నిర్వాసితులకు కేటాయించిన భూములను వారు ప్రస్తుతం ఇక్కడకు వచ్చి సాగు చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ భూములను స్థానికంగా ఉన్న కొందరు గిరిజనుల ఆధ్వర్యంలో గుత్త బేరంగా కౌలుకు ఇచ్చేస్తున్నారు. వీటిని తక్కువ కౌలుకు తీసుకుని ఎక్కువ కౌలుకు బయట వ్యక్తులకు ఇస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న గిరిజనుల మధ్య వివాదాలు వస్తున్నాయి. నిర్వాసితుల కౌలు సొమ్ములు కొందరే తినడం ఏంటి మేము గిరిజనులం కాదా అని వీరు నిర్వాసిత భూముల్లోకి అడ్డంగా వెళుతున్నారు. దీంతో ఇక్కడ వివాదాలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం భూమి ఇచ్చేశాం కొట్టుకుచావండన్నట్లుగా చూస్తూ ఊరుకోవడంతో ప్రతిసారి ఈ వివాదాలు సర్వసాధారణంగా మారాయి. భవిష్యత్‌లో ఇవి మరింత ఎక్కువ కాకముందే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలి్స న అవసరం ఉంది. -
నిర్వాసితులపై దళారుల పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక రైతు తనకున్న 40 ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇంతలో ఓ దళారి రంగప్రవేశం చేశాడు. సొమ్ములు ఇస్తేనే ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారం అందుతుందని.. లేదంటే నీ సంగతి అంతేనంటూ భయపెట్టాడు. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఆ రైతుతో సంతకం చేయించుకున్నాడు. మూడు ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నాడు. భూసేకరణ జరిపిన ఐటీడీఏ పీఓ షణ్మోహ¯ŒS నేరుగా ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేయించారు. అయినా.. దళారి ఊరుకోలేదు. తనవల్లే ఆ పని అయ్యిందని, ఎకరానికి రూ.50 వేల చొప్పున 40 ఎకరాలకు రూ.20 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాడు. లేదంటే తనవద్ద ఉన్న స్టాంప్ పేపర్, బ్యాంకు చెక్కులను వినియోగించి రకరకాల కేసులు వేయిస్తానని బెదిరించాడు. దిక్కులేని పరిస్థితిలో ఆ దళారికి రైతు రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. ఈ విషయం బయటపడితే తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాడోననే భయంతో నోరు మెదపటం లేదు. ఇదిలావుంటే.. దర్భగూడెం గ్రామానికి చెందిన మరో రైతుకు అదే గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆ భూమిని మరొకరు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో ఏజెన్సీలో తలెత్తిన ఘర్షణల కారణంగా ఆ రైతు ఊరొదిలి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేశారు. అంతకుముందే దళారులు అతని నుంచి చెక్కులు తీసుకున్నారు. అతనికి అందిన పరిహారంలో సగం సొమ్ము తీసుకున్నారు. అందులో కొంత సొమ్మును అనుభవదారుకు ఇచ్చారు. దీంతో లబోదిబోమనడం అటు రైతు, ఇటు భూమి అనుభవదారుల వంతయ్యింది. పెచ్చుమీరిన పర్సంటేజీల దందా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే వారి కోసం సేకరిస్తున్న భూముల విషయంలో దళారుల దందా పెచ్చుమీరింది. భూములిచ్చిన రైతులకు చెల్లించే పరిహారం వారికి అందాలంటే తాము అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపుబారిన పడే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు జీలుగుమిల్లి మండలం లోని దర్భగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం, పి.అంకంపాలెం, పి.నారాయణపురం, రాచన్నగూడెం, బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో 4,035 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశారు. అప్పటికే వారినుంచి ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్న దళారులు తాము అడిగినంత సొమ్ములు ఇవ్వకపోతే పరిహారం సొమ్ము వెనక్కి వెళ్లిపోయేలా చేస్తామని బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెగబడుతున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. దర్భగూడెంలో 230 ఎకరాలు సేకరించగా.. ఒక చోటా నాయకుడు రైతుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. కేసులు తప్పవు పరిహారం అందిన రైతుల నుంచి ఎవరైనా కమీషన్ల రూపంలో సొమ్ములు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని భూసేకరణ అధికారి షణ్మోహన్ తెలిపారు. బాధితులు తనకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.