‘సమాచారం’ నై.. | no information | Sakshi
Sakshi News home page

‘సమాచారం’ నై..

Published Thu, Jul 21 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

‘సమాచారం’ నై..

‘సమాచారం’ నై..

రాష్ట్ర సమాచార శాఖ కమిషనరేట్‌లో అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్‌ మీడియా ప్రతినిధులను ఇబ్బంది పెడుతోంది. సమన్వయం చేసేవారు కరువవ్వడంతో ఎవరికివారే యమునాతీరే చందంగా వ్యవస్థ నడుస్తోంది. ప్రజలకు తెలియజేసేందుకు పత్రికా ప్రతినిధులకు ఇవ్వాల్సిన సమాచారం విషయంలో తమ బాధ్యత కాదని కొందరు.. తమ పనికాదని మరికొందరు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇంతజరుగుతున్నా పరిస్థితిని గాడినపెట్టాల్సిన పెద్దలు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, విజయవాడ : 
నూతన రాజధాని కేంద్రంలో ఏర్పాౖటెన రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కమిషనరేట్‌ అధికారులు, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. మీడియాకు సమాచారం ఇవ్వటానికి ఇటీవల అవుట్‌ సోర్సింగ్‌లో నియమితులైన సిబ్బందికి, ప్రభుత్వ సిబ్బందికి మధ్య కూడా పడటం లేదు. ఎవరికి వారు తమకు సంబంధం లేదని తప్పుకుంటున్నారు. దీంతో పత్రికా ప్రతినిధులకు కార్యక్రమాల వివరాలు మెసేజ్‌లు కూడా సక్రమంగా అందడంలేదు. ఎవరూ ఏ పని చేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. బుధవారం టూరిజంపై మంత్రుల కమిటీ నిర్వహించిన సమాచారం, కాపు కార్పొరేషన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు అందించటంలో అధికారులు అలసత్వం వహించారు. ప్రతి రోజూ పత్రికలకు సమాచారం ఇవ్వటం, ఫొటోలు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు  ఫీడ్‌ పంపటం, పత్రికా ప్రకటనలు జారీలో కూడా తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీరందరినీ సమన్వయం చేసే నాథుడే లేకపోవటంతో మీడియా ప్రతినిధులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇన్‌కెమెరా మీటింగ్‌లలో స్పాట్‌ ఐటమ్స్‌ ఎవరూ పట్టించుకోవటం లేదు. మీడియాను లోపలకు అనుమతించకపోగా, సమాచారం ఇవ్వకపోవటం వల్ల పాత్రికేయులకు తిప్పలు తప్పడంలేదు. రాష్ట్ర స్థాయి అధికారులు, సీఎం ప్రెస్‌మీట్‌లు, క్యాంపు కార్యాలయంలో జరిగే విషయాలను మెయిల్స్‌ ద్వారా ఆలస్యంగా ఇస్తున్నారు. స్థానికంగా ఉండే సమాచార అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కేవలం కలెక్టర్‌ పర్యటనలు, సమావేశాలకు పరిమితమవుతున్నారు. మంత్రులు, ఇతర వీఐపీల సమావేశాలు, ముఖ్యమైన ఇంటర్నల్‌ సమావేశాలకు సమాచార శాఖ అధికారులు ఎగనామం పెడుతున్నారు. సమాచారం అడుగుతుంటే ఎవరికి వారు తమకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. స్థానికంగా జరిగే సమావేశాల సమాచారం కూడా సక్రమంగా పంపటంలో అధికారులు విఫలమవుతున్నారు.
ఎవరికి వారే  యమునాతీరే..
అవుట్‌సోర్సింగ్‌లో నియమించిన ఉద్యోగులు కూడా కొన్ని సమావేశాలకు సంబంధించి ప్రెస్‌నోట్‌లు వస్తాయని, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వస్తాయని, కొందరు డివిజన్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి వస్తాయని ఎవరికివారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ చివరకు సమాచారం ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలో మకాం ఉంటున్న సమాచార శాఖ కమిషనర్‌ వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి అధికారుల మధ్య సమన్వయం చేయాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement