రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
– యువతకు చేయుత లేదు
– మండలి ఎన్నికల్లో మద్దతిస్తే పట్టభద్రుల సమస్యలపై గళం విప్పుతా
– వైఎస్ జగన్ నాయకత్వంలో విద్యాభివృద్ధికి కృషి
– వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
కర్నూలు(రాజ్‌విహార్): రాష్ట్రంలో మహిళలు, అధికారులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎన్‌జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కర్నూలులోని కట్టమంచి రామలింగా రెడ్డి స్కూల్స్, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు, ఉస్మానియా కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలు నడిరోడ్డుపైనే బహిరంగంగా మహిళలపై చెప్పులు, కాళ్లతో దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్నారని చెప్పారు. ఇక యువతకు చేయుత లేకపోవడంతో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాబు రావాలంటే బాబు రావాలనే ప్రచారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను కూడా కోత పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న ఆయన పట్టభద్రులకు చేసిందేమీ లేదనా్నరు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాయలసీమ పశ్చిమ ప్రాంత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై గళం విప్పుతానని తెలిపారు. వైఎఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో జెడ్పీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు మీసాల రంగన్న పాల్గొన్నారు.