ఆశలు ఆవిరి | No rainfall sufficient for Soybean crop farmers | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి

Published Mon, Jun 27 2016 11:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఆశలు ఆవిరి - Sakshi

ఆశలు ఆవిరి

-  తొలకరిలో విత్తిన రైతులు
-  సాధారణ వర్షపాతం కరువే !
-  మొలక రానందున దున్నేస్తున్నారు
-   క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన

 
 ఆర్మూర్ : ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ క్షేత్రాల్లో విత్తుకున్న సోయాబీన్ విత్తనం మొలకెత్తకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. శ్రమ, పెట్టుబడి తక్కువగా అవసరం ఉన్న సోయాబీన్ పంటను పండించడానికి జిల్లాలోని రైతులు పదేళ్లుగా ఆసక్తి చూపుతున్నారు. వర్షాధార పంట కావడంతో బోరు బావులు, మోటార్లు అందుబాటులో లేని రైతులు సైతం సోయాబీన్ పంటను వేస్తున్నారు.
 
 దీంతో ఈ ఏడాది వర్షాలను బట్టి జిల్లాలో 3 లక్షల 70 వేల ఎకరాల్లో సోయాబీన్ పంటను పండించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనావేశారు. అందుకు అవసరమైన ఒక లక్ష 25 వేల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను ఇప్పటికే దిగుమతి చేసుకొని సొసైటీల ద్వారా సబ్సిడీపై రైతులకు అందజేసారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జూన్ మొదటి, రెండో వారంలో కురిసిన తేలికపాటి వర్షానికి రైతులు సోయా పంటను విత్తుకున్నారు. విత్తనాన్ని విత్తుకున్న తర్వాత ఒకటి, రెండు వర్షాలు కురిస్తే గానీ విత్తనం మొలకెత్తే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా తొలకరితో సుమారుగా ఒక లక్ష 50 వేల ఎకరాల్లో సోయా పంటను విత్తుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించక సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఈ నెల 8న మిరుగుతో వర్షాకాలం ప్రారంభం కాగా 18 రోజులలో కేవలం ఆరు సార్లు మాత్రమే చిన్నపాటి వర్షాలు కురిసాయి. జూన్‌లో 20 సెంటీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 8 సెంటీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. పంట పొలాల్లో రైతులు విత్తుకున్న సోయా విత్తనాలు మొలకెత్తక పోగా ఎండిపోవడంతో చీమలు తినేస్తున్నాయి.
 
 సోయాబీన్ ఎలా పండిస్తారు..
 జిల్లాలో మొక్కజొన్న పంటకు బదులుగా సోయాబీన్ పంట పండించడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. వర్షాధార పంట అయిన సోయాబీన్ 90 రోజుల పంట. నల్లరేగడిలో వర్షధారంపై విస్తారంగా పండుతుంది. నీటి ఆధారంగా ఏర్రగరప, చౌడు నేలల్లో పండుతుంది. ఖరీఫ్ సీజన్‌లో మధ్యస్థ ఉష్ణోగ్రతలో ఈ పంట పండుతుంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకుంటారు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు విత్తాల్సి ఉంటుంది. ఒక సెంటిమీటర్ కంటే లోతుగా విత్తనాలను విత్తితే మొలకరాదు. అందువల్ల పైపైనే విత్తుతారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తుంది. తక్కువ పెట్టుబడి, కూలీల అవసరం పెద్దగా ఉండ క పోవడంతో లాభాలు తెచ్చి పెడుతున్నందుకు రైతులు సోయాబీన్ పంట పండించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
 
 ప్రస్తుతం ప్రతికూల పరిస్థితి..
 వర్షాలు కురుస్తాయనే ఆశతో సోయాబీన్ విత్తనాన్ని విత్తుకున్న రైతులకు వర్షాలు కురియకపోవడంతో ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. బోరు బావులు అందుబాటులో ఉన్న రైతులు ఒక తడి పారించడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. భూమిలో పది నుంచి 15 రోజుల పాటు విత్తనం మొలకెత్తని పరిస్థితుల్లో ఇక పంట మొలకెత్తదనే భావనతో రైతులు నష్టపోయినట్లు భావిస్తున్నారు. కొందరు రైతులు సోయా పంటపై ఆశలు వదులుకొని సోయా విత్తిన భూములను దున్నేస్తున్నారు.  
 
 నాలుగు రోజుల తర్వాతైనా మళ్లీ వర్షాలు కురిస్తే సోయా విత్తుకోవచ్చని భావించిన రైతులకు సోయాబీన్ విత్తనం అందుబాటులో లేకుండా పోయింది. ఒక వేళ విత్తనం అందుబాటులో ఉన్నా పెట్టుబడి వ్యయం పెరిగిపోతుంది. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించవచ్చని భావించిన జిల్లా రైతాంగానికి ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమే చేదు అనుభవాన్ని మిగిల్చింది.
 
 పంటను పరిశీలిస్తున్న అధికారులు..
 వర్షాభావ పరిస్థితుల్లో రైతులు విత్తిన సోయాబీన్ విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతుల విజ్ఞప్తి మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
 
 గతేడాదిలాగే ఉంది పరిస్థితి..
 గతేడాది కరువుతో నష్టపోయాము. ఈ సారైనా వర్షాలు కురిసి పంటలు పండుతాయని ఆశించాము. కాని పరిస్థితి గతేడాదిలాగే ఉంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కువరకపోతే సోయాబీన్ వేసిన మడిని దున్నేయడం తప్ప ఇంకో మార్గం లేదు.
 - రాజన్న, రైతు, శ్రీరాంపూర్
 
 వ్యవసాయ శాఖ అధికారుల మాటల్లో నిజాలు లేవు..
 వర్షాకాలం ప్రారంభం కంటే ముందు నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది విస్తారంగా వర్షాలంటూ అబద్ధాలను ప్రచారం చేసారు. వారి మాటలను నమ్మి తేలిక పాటి వర్షాలకు విత్తనం వేసుకొని నష్టపోయే పరిస్థితిలో ఉన్నాము.
 - చిన్నయ్య, రైతు, శ్రీరాంపూర్
 
 సాధారణ వర్షపాతం కూడా
 నమోదు కాలేదు..
 జూన్ మాసంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖ అధికారులు రైతులకు సరైన సమాచారం, అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సోయా విత్తుకోవడానికి జూలై 15 వరకు అవకాశం ఉంటుంది.
 - జితేందర్‌రెడ్డి, రైతు, మచ్చర్ల, ఆర్మూర్ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement