ఏ అధికారి అయినా ఫోన్ ఎత్తితే ఒట్టు!
► ఫోన్‌లు ఎత్తని అధికారులు
► ఎమ్మెల్యేలు ఫోన్‌కైనా నో రెస్పాన్స్
► మిస్డ్ కాల్‌కూ నో రిప్లై
► ప్రభుత్వ నెంబర్లు ఉన్నా అదే తీరు
శ్రీకాకుళం టౌన్: పారదర్శకం పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అధికారులకు శాఖల వారీగా ఫోన్ నెంబర్లు కేటాయించారు. ఈ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా శాఖల వారీగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం ఫోన్లు ఇచ్చారు. గ్రూప్ సిమ్‌లను వారికివ్వడం ద్వారా సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు గ్రూపుల్లో చేర్చారు. అర్ధరాత్రి అవసరమున్నా ఈ ఫోన్ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఉత్తర్వులు ఉన్నాయి. అయితే జిల్లాలో కొందరు అధికారులు మాత్రం రాత్రిపూటే కాదు పగటిపూట కూడా ఫోన్ ఎత్తక పోవడంతో ప్రజల మాటెలా ఉన్నా ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు. పనులు చేయమని ఒత్తిడి చేయడం మాట అలా ఉంచితే సమాచారం కావాలన్నా సమాధానం చెప్పడానికి ఫోన్ ఎత్తడం లేదంటూ సాక్షాత్తు ఎమ్మెల్యేలే మొత్తుకుంటున్నారు.
ఫోన్ ఎత్తే అలవాటే లేదు
జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజక్టు అధికారిగా పని చేస్తున్న రోణంకి కూర్మనాథ్‌కు అసలు ఫోన్ ఎత్తే అలవాటే లేదట. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబరు 87900 08399. ఈ నెంబరుకు ఎవరు ఫోన్ చేసినా నో రిప్లైల రాక తప్పదు. సమావేశంలో ఉన్నా తర్వాత ఫోన్ చేసిమాట్లాడే అలవాటు లేదు. ఇది సాధారణ పౌరులు చెప్పే మాట కాదు.. స్వయాన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతిలు సభా ముఖంగా ఈ అంశాన్ని ఇటీవల జరిగిన విజిలెన్సు అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టరు డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎదుట ప్రస్తావించారు. ఇలాంటి వారు ప్రభుత్వ శాఖల్లో కోకొల్లలుగా ఉన్నారు.
పోలీసు శాఖలోనూ...
శాంతి భద్రతలు పరిరక్షించే బాధ్యతల్లో ఉన్న పోలీసు శాఖకు ఈ జాడ్యం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ అప్పలనాయుడికి ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబరు 94407 95806. ఈ నెంబరు అత్యంత కీలకం. ఈయన నెంబరుకు ఎవరు, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తడం గగనమే. ఆయన బాటలోనే శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ మదుసూధనరావు కూడా ఉన్నారు. ఈయనకు ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబర్ 94407 95820. ఈ నెంబరుకు ఫోన్ చేయాలంటే ముందుగా రూరల్ పోలీసుస్టేషన్‌లో లాండ్ లైన్ ఫోన్‌కు మాట్లాడాలి. అక్కడి నుంచి వారు సమాచారం ఇస్తే తప్ప ఫోన్ ఎత్తే అలవాటు లేదట. మున్సిపాలిటీలో కమిషనర్ టి.శ్రీనివాస్‌కు ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబరు 98499 05787. ఈ నెంబరుకు ఫోన్ చేస్తే పక్కనున్న వారే మాట్లాడతారు.
కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫోనైనా సరే పక్కనున్న వారు సమాధానం చెప్పిన తర్వాత సార్‌కు ఇస్తారట. మున్సిపాలిటీలో ఎంఈ వెంకటేశ్వరరావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి సురేష్‌లకు ఇదే అలవాటుగా మారిందట. ఇక అరసవ ల్లి ఈఓ శ్యామలాదేవి (90009 02338), గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రవీంద్రనాథ్ (91001 20600)లకు ప్రభుత్వ ఫోన్ నెంబర్లు కేటాయించారు. ఈ నెంబర్లకు ఫోన్ చేసినా అదేతీరు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రభుత్వం ఫోన్ నెంబరు ఇచ్చినా ఈ పరిస్థితి ఉంటే సొంత నెంబరైతే ఇంకెలా ఉంటుందో మరి. ఇలాగైతే జవాబుదారీ తనం ఎలా సాధ్యం. సామాన్యులకు న్యాయం ఎలా అని జిల్లా ప్రజలు నిట్టూరుస్తున్నారు.