రబీ సీజన్‌లో వరి వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రబీ వరి సాగుకు చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రబీ పంటల సాగుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వరి బదులు ఆరుతడి పంటలే సాగుచేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అందుకు రైతులను ఒప్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బావులు, బోర్లు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు.
ప్రధాన జలాశయాల్లోనూ నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే సగానికి పడిపోయాయన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా రబీ వ్యవసాయ పంటల సాగు 19 శాతానికి పడిపోయింది. అందులో ఆహార ధాన్యాల సాగు 13 శాతానికే పరిమితమైంది. వరి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. రబీలో 16.12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా... కేవలం 2 వేల ఎకరాలకే పరిమితమైంది. వరి వేసే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ నేపథ్యంలో వరి బదులుగా వేరుశనగ, పెసర, మినుము, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, నువ్వులు, అలసంద వంటి పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. అందులో పెసర, మినుము, నువ్వులు, అలసంద వంటి విత్తనాల సబ్సిడీని 33 శాతం నుంచి 50 శాతం పెంచాలని నిర్ణయించాం’’ అని పార్థసారథి తెలిపారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాల రాయితీని కిలోకు రూ.25 నుంచి రూ.50కు పెంచినట్లు తెలిపారు. తద్వారా ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామన్నారు. విత్తనాలను సంబంధిత సరఫరా సంస్థల ద్వారా పంపిణీకి ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు.