భోజనం అసంపూర్ణం
♦ రెండు నెలలుగా పప్పుకూర లేదు
♦ అంగన్‌వాడీలకు సరఫరా కాని కందిపప్పు
♦ ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం అభాసుపాలు
♦ గర్భిణులు, పిల్లలకు కూరగాయలతోనే భోజనం
♦ టెండర్ల నిర్వహణలో జాప్యం
ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం ఆపదలో పడింది. రెండు నెలలుగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ‘కందిపప్పు’ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఒక పూట సంపూర్ణ భోజనం పప్పు కూర లేకుండా అసంపూర్ణంగా చేసి వెళుతున్నారు. రెండు నెలలుగా పప్పు రుచి చూడకుండా కూరగాయల భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. అది కూడా నాణ్యత లేని కూరగాయలతో కార్యకర్తలు భోజనం వండి
పెడుతున్నారు. దీనంతటికి కారణం అధికారులు టెండర్లు నిర్వహించకపోవడమే. జిల్లాలోని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, భీమ్‌గల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, మద్నూరు, కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి ప్రాజెక్టుల కింద మెయిన్, మినీ కలిపి మొత్తం 2,711 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 1,38,671 మంది పిల్లలు, 42,122 మంది గర్భిణులు, బాలింతలు అనుంబంధ పోషకాహారం తిని వెళుతున్నారు. ప్రభుత్వం అందించే పప్పు, కూరగాయలతో వీరికి ప్రతిరోజు సంపూర్ణ భోజనం పెట్టాలి.
అందులో భాగంగానే 2015 జనవరి1 నుంచి ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. కూరగాయలు కొనుక్కునే బాధ్యతను అంగన్‌వాడీ కార్యకర్తలకే ఇచ్చారు. కానీ కంది పప్పును మాత్రం మొన్నటి వరకు ప్రభుత్వం రాష్ట్ర సివిల్ సప్లయి శాఖ ద్వారా జిల్లాకు సరఫరా చేసింది. అయితే ఫిబ్రవరి నుంచి జిల్లాకు కంది పప్పును సరఫరా చేయడం లేదు. ఆయా జిల్లాల్లోనే టెండర్లు నిర్వహించుకుని కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు పింపిణీ చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. టెండర్లను నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయగా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న కందిపప్పు నిల్వలు మొత్తం ఖర్చు కావడంతో రెండు నెలలుగా కందిపప్పు కూరను వండి కేంద్రానికి వచ్చే వారికి పెట్టడం లేదు. కేవలం కూరగాయలతోనే భోజనం చేసి వెళ్లడం గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఇబ్బంది కరంగా మారింది. పప్పు కూర వండిపెట్టడం లేదని కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. కేవలం గుడ్లు, పాలతో సరిపెట్టుకుని వెలుతున్నారు. తద్వారా ప్రభుత్వ లక్ష్యం అయిన మాత, శిశు మరణాల తగ్గింపుపై, పిల్లల బరువు పెరుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
టెండర్ల నిర్వహణలో జాప్యం ఎందుకో...
జిల్లాలో ఉన్న 2,711 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను ప్రతినెలా 470 క్వింటాళ్ల కందిపప్పు అవసరం అవుతోంది. పది ప్రాజెక్టులకు గాను ఒక్కో ప్రాజెక్టుకు 35-60 క్వింటాళ్ల వరకు కందిపప్పు సరఫరా అవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి భోజనం తిని వెళ్లే వారు ఎక్కువగా పప్పుకూరనే ఇష్టపడుతారు. పప్పు లేకపోవడంతో తినకుండానే కేంద్రం నుంచి వెళ్లిపోతున్నారు. అయితే రాష్ట్ర సివిల్ సప్లయి శాఖ నుంచి సరఫరా నిలిచిపోయిన వెంటనే ఐసీడీఎస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయి కందికప్పును యథావిధిగా కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ టెండర్ల నిర్వహణలో జాప్యం చేయడం వల్ల రెండు నెలలుగా కేంద్రాలకు పప్పు సరఫరా కావడం లేదు. అసలు టెండర్లను నిర్వహించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు.
ప్రాసెస్‌లో ఉంది..
అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోవడంపై ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ఫోన్‌లో సంప్రదించగా.. టెండరు ప్రాసెస్‌లో ఉంది అంటూ ఫోన్ పెట్టేశారు.