- అంగన్‌వాడీలకు మూడు నెలలుగా అందని వేతనాలు
- ఆర్థిక ఇబ్బందుల్లో కార్యకర్తలు, ఆయాలు
- ఏప్రిల్ నుంచి వేతనాలు పెంచిన ప్రభుత్వం
- విడుదలలో ఎడతెగని జాప్యం
అనంతపురం టౌన్ :
నెలంతా పడిన కష్టానికి ఒకటో తేదీన వేతనమందితే ఆ ఉద్యోగి కళ్లలో ఆనందానికి అవధులుండవు. వేతన జీవులకు అదే ఆదరువు. అలాంటిది మూడు నెలల నుంచి వేతనాలు రాకపోతే ఎలా బతకాలి? ప్రస్తుతం అంగన్‌వాడీలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వేతనాలందక, కేంద్రాల అద్దెలు, కూరగాయల బిల్లులు, ఫైర్‌ఉడ్ చార్జీలు పేరుకుపోయి అవస్థ పడుతున్నారు. గ్రీవెన్స్‌లకు వెళ్లి అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్, 840 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,082 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 4,461 మంది ఆయాలు పని చేస్తున్నారు. వీరికి నెలనెలా వేతనాలు సక్రమంగా అందడం లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.4,263, ఆయాలకు రూ.2,200 చొప్పున వేతనం ఉండేది.
అనేక ఆందోళనల నేపథ్యంలో వీరి వేతనాలను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కార్యకర్తలకు రూ.7,063, ఆయాలకు రూ.4,500 చేసింది. పెంచిన వేతనాలు మాత్రం ఇప్పటికీ అమలు చేయలేదు. పైగా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి వేతనాలు కూడా చెల్లించలేదు. మొత్తం రూ.16 కోట్ల 15 లక్షల 69,350 విడుదల కావాల్సి ఉంది.
అప్పులు చేసి కుటుంబ పోషణ
వేతనాలు రాని నేపథ్యంలో అంగన్‌వాడీలు అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకురావాల్సి వస్తోంది. కొందరు ఏకంగా గ్రీవెన్స్‌లకు వెళ్లి అధికారులకు విన్నవిస్తున్నారు. సోమవారం డీ హీరేహాళ్‌లో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది.
విడుదల కాని బకాయిలు
అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిలు, కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్ చార్జీలను కూడా నెలల తరబడి చెల్లించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇంత వరకు ఏ ప్రాజెక్టుకూ బడ్జెట్ రాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆన్‌లైన్‌లో వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. దాన్ని మరచి సాధారణ పద్ధతుల్లోనే చెల్లించడానికి పూనుకున్నారు. ఈ ప్రకారం కూడా వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
త్వరలోనే వేతనాలు వస్తాయి. ప్రాజెక్టుల వారీగా ఎంత మొత్తం రావాలో ప్రతిపాదనలు పంపించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త వేతనాలే అందుతాయి.
- జుబేదాబేగం, ప్రాజెక్ట్ డెరైక్టర్,
ఐసీడీఎస్, అనంతపురం
ప్రైవేటీకరణకు కుట్ర
ఐసీడీఎస్‌ను ప్రైవేటీకరించాలన్న కుట్ర జరుగుతోంది. ఆ ఉద్దేశంతోనే బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గిస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు రాకుంటే ఎలా బతకాలి? తక్షణం విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- వి.వనజ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి