♦ అభ్యర్థులకు టీఆర్‌ఎస్ బుజ్జగింపులు
♦ గడువు ముగిశాక విత్‌డ్రా అంటూ ఆరోపణలు
♦ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు
♦ కమిషనర్‌తో వాగ్వాదం.. ఈసీకి ఫిర్యాదు
ఖమ్మం : నామినేషన్ల ఉపసంహరణల ఘట్టం ఆద్యంతం ఉత్కంఠభరితంగా మారింది. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు 576 నామినేషన్లు ఆమోదం పొందగా.. బరిలో నిలిచిన అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పలేదు. వారిని ఉపసంహరింపజేసేందుకు ఆయా పార్టీల నాయకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. పలు నామినేషన్లు గడువులోగా ఉపసంహరించగా.. మరికొన్ని నామినేషన్లు గడువు ముగిసినా ఉపసంహరించేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు హైరానా పడాల్సి వచ్చింది. ఉపసంహరణ సమయం గడిచిపోయిందని కార్పొరేషన్ గేట్లను అధికారులు మూసివేశారు. ఈలోగా ఉపసంహరణకు అంగీకరించిన అభ్యర్థి సతీష్ కార్యాలయం లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు.
పోలీసులు ఆయనను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీనిని గమనించిన కార్యాలయం లోపల ఉన్న సైదారావు అనే కార్యకర్త సతీష్ వద్దకు వచ్చాడు. గేటు ఇవతల ఉన్న సతీష్ వద్ద నుంచి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని తీసుకుని సైదారావు.. తానే సతీష్ అంటూ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ తంతు జరిగిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతోపాటు పలువురు కార్యకర్తలు కార్పొరేషన్ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే కార్యాలయం గేట్లు వేయడంతో వాటిని నెట్టేందుకు నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గేటు ఎక్కి.. కార్యాలయంలోకి దూకి వెళ్లారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన పోలీసులు గేటు తాళం తీశారు.
వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ డౌన్ డౌన్.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న నాయకులు, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి కమిషనర్ చాంబర్‌కు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారు. 49వ డివిజన్‌లో ఉపసంహరణ విషయంపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి కార్యాలయంలో ఎందుకున్నారని ప్రశ్నించారు. దీనికి కమిషనర్ సమాధానమిస్తూ.. రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక హోదా కల్పించామని, గడువు ముగిసిన తర్వాత ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. ఏ విషయమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే నా పని అని సమాధానమిచ్చారు. కమిషనర్‌గా ఉండి.. విషయం తెలియదని చెప్పడం సరికాదని కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టారు. దీంతో జరిగిన విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. విచారణ జరిపిస్తామని కమిషనర్ చెప్పారు.
అనంతరం కార్పొరేషన్ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా ఉపసంహరణ పత్రాలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం పేరుతో వినతిపత్రం అందజేసి.. కమిషనర్ చాంబర్ నుంచి బయటకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా అభ్యర్థుల ఉపసంహరణ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.