అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ గిరీషా
– జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష
– పనులు వేగవంతం చేయాలని ఆదేశం
తిరుపతి తుడా: గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లోని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పనులను నవంబర్ రెండో వారం లోపు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలేరు–నగరి ప్రాజెక్టు పనులను వేగవంతానికి ప్రణాళికలు అమలుచేయాలని ఆయన సూచించారు. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాల వల్ల ముంపునకు గురైన బాధితులకు అందాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. సోమశిల, స్వర్ణముఖి అనుసంధానం ద్వారా జిల్లాలో 72 చెరువులకు కాలువ ద్వారా నీటిని ఇచ్చేలా కాలువల తవ్వకం, పూడిక తీసే పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆయన సబ్‌కలెక్టర్ హిమాంశు శుక్లా, జీఎన్‌ఎస్‌ఎస్, డెప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఇంజనీరింగ్ అధికారులతో కలసి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, తహశీల్దార్ రాజారావు పాల్గొన్నారు.