
హాంఫట్
ఖాజీపేట:
వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి నీటిచుక్క రైతులకు సద్వినియోగం కావాలని పూర్వం మన పెద్దలు ఆలోచించి చెరువులను తవ్వించారు. ఆ చెరువుల నుంచి వచ్చే నీటిని సాగునీటిగా ఉపయోగించుకుని రైతులు పంటలు పండించేవారు. కానీ నేడు తమ పూర్వీకులు మనకు అందించిన చెరువులను బాగుచేయక పోగా ఉన్న చెరువులను ఆక్రమించి చెరువు ఉనికిని ప్రశ్నర్థకంగా
మారుస్తున్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో రైతుల సాగునీటి కోసం పూర్వీకులు చెరువును తవ్వించారు. చెరువు 67.07ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ చెరువును గత కొన్ని సంవత్సరాలుగా కొందరు 17 ఎకరాల మేరకు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది. చెరువులో నీటినిల్వ బాగాతగ్గిపోయింది. కొద్దిపాటి నీటికే చెరువు నిండిపోవడంతో చెరువు కింద రెండుకార్లు పంటలు
సాగుచేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆక్రమణ తొలగించాలని ఎమ్మెల్యేఫిర్యాదు
చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైందని.. ఆక్రమణను తొలగించి చెరువును పరిరక్షించాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జిల్లా కలెక్టర్ మొదలుకుని ఉన్నతాధికారులందరికి గత ఏడాది జనవరి 9న ఫిర్యాదు చేశారు. గత ఏడాది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లారు. కానీ రెవెన్యూ అధికారులు కొందరు స్థానిక టీడీపీ
నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆక్రమణను తొలగించకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలుపంపుతూ వచ్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
చెరువులను పరిశీలించిన అధికారులు
దుంపలగట్టు చెరువును ఆక్రమించారని గత కొంతకాలంగా చాలామంది ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఆక్రమణపై 2005లో జిల్లాస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పరిశీలించి ఆక్రమణకు గురైన స్థలాన్ని తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. చెరువులోని బోరును తొలగించాలని, హద్దులు నిర్ణయించి కరకట్ట నిర్మించాలని సూచించారు. చాలామంది ఆర్‌డీఓలు వచ్చి చెరువును పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు కానీ చెరువు ఆక్రమణ తొలగింపుపై ఎవరూ పూర్తిస్థాయిలో చర్యలు
తీసుకోలేదు.
నిధులు మంజూరైనా నిష్ప్రయోజనమే..
చెరువు అభివృద్ధికిడీఆర్‌డీఏ ద్వారా 2015 మార్చిలో రూ.1,52,237 నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆ నిధులు వినియోగించలేదు. చెరువు ఆక్రమణలను తొలగించలేదు.
నిద్రపోతున్నారా అంటూ అధికారులపై జేసీ ఆగ్రహం
ఎమ్మెల్యే ర ఘురామిరెడ్డి ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్ శ్వేతా బుధవారం దుంపలగట్టు చెరువును పరిశీలించారు. చెరువు పరిస్థితిపై అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించి వారి పనితీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చెరువు ఆక్రమణలు తొలగించాం.. అంతా తమ ఆధీనంలో ఉందన్నారు.. ఇక్కడచూస్తే చెరువు భూమిలో అరటి పంట సాగులో ఉంది.. ఇలాగే
పనిచేస్తారా.. అందరూ నిద్రపోతూ పనిచేస్తున్నారా.. నివేదికలు ఇలాగే ఇస్తారా’ అంటు ఆర్‌డీఓ చిన్నరాముడు, తహశీల్దార్ శివరామయ్యలపై అసహనం వ్యక్తంచేశారు. ఆక్రమణ భూమిలో సాగుచేసిన పంటను తొలగించి హద్దులు నిర్ణయించండి.. అందుకు తగ్గట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆమె వారిని ఆదేశించారు.