మండల పరిధిలోని మునగాల గ్రామ వృద్ధాప్య పింఛన్లపై తెలుగు తమ్ముళ్లు ప్రతాపం చూపించారు.
వృద్ధుల పింఛన్లపై ‘అధికార’ ప్రతాపం
Jul 7 2017 12:17 AM | Updated on Aug 10 2018 9:42 PM
నంద్యాలరూరల్: మండల పరిధిలోని మునగాల గ్రామ వృద్ధాప్య పింఛన్లపై తెలుగు తమ్ముళ్లు ప్రతాపం చూపించారు. వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారనే అక్కసుతో అధికార పార్టీ నాయకులు తమ పింఛన్లు తొలగించారని బాధిత వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మునగాల గ్రామానికి చెందిన బాధిత వృద్ధులు దాయాది సుబ్బన్న, తూము చిన్న శివారెడ్డి, చింతమాను సంజమ్మ, సంటి ఒబులమ్మ, సంటి భాగ్యమ్మ, దాయాది లక్ష్మమ్మ తదితరులు గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 2016 డిసెంబర్ వరకు పింఛన్ ఇచ్చి తర్వాత తొలగించారని తెలిపారు. గ్రామంలో 111 సామాజిక పింఛన్లుండగా 41 వృద్ధాప్య, 29 వితంతు, 13 వికలాంగ, 28 అభయాస్తం పింఛన్లున్నాయి. ఇందుకోసం ప్రతి నెలా రూ.1.16 లక్షలు అందజేస్తున్నారు. 67 సంవత్సరాలు పైబడిన తమపై అధికార పార్టీ గ్రామ నాయకుడు కక్ష కట్టి రద్దు చేయించారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఎంపీడీఓ స్వర్ణలతను వివరణ కోరగా సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పూర్తిస్థాయిలో విచారించి కుమారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నట్లు తేలిన వారి పింఛన్లు తొలగించామని తెలిపారు.
Advertisement
Advertisement