బొక్కేస్తున్నారు
► ప్రజాప్రతి ‘నిధులే’ మింగేస్తున్నారు!
► సర్పంచులు,ఎంపీటీసీ, జన్మభూమి కమిటీ సభ్యులు కూడా పింఛన్‌దారులే
► వికలాంగుల కోటానూ వదలని ‘మేత’లు
► నెలనెలా ఇళ్లకు వెళ్లి పింఛన్ ఇస్తున్న అధికారులు
ఈ కింది చిత్రంలో కనిపిస్తున్నది కళ్యాణదుర్గంలోని ఎస్‌వీ గార్మెంట్స్. ప్రధాన రహదారిలో ఉన్న ఈ వస్త్ర దుకాణం యజమాని బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి. సింగిల్ విండో మాజీ డెరైక్టర్ కూడా. ఆయనకు అన్ని అవ యవాలు సక్రమంగా పనిచేస్తున్నా సర్కార్ ఇచ్చే పింఛన్ కోసం వికలాంగుడిగా మారిపోయూడు. కళ్లు మూసుకున్న అధికారులు కూడా ప్రతీ నెలా సదరు వస్త్ర దుకాణం యజమానికి రూ.1000 పింఛన్ (ఐడీ నంబర్ 112705206) చెల్లిస్తున్నారు. ఇలాంటి బొక్కుడు ప్రజాప్రతినిధులు ఇంకా చాలా మందే ఉన్నారు. అధికార పార్టీ అండ..అధికారుల వైఖరితో ప్రజాధనాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు.
బ్రహ్మసముద్రం : వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పంచ భక్ష పరమాన్నాలకు కొదవ ఉండదని సామెతను నిజం చేస్తున్నారు టీడీపీ నేతలు. నిరాశ్రయులు, వికలాంగులకు, అభాగ్యులకు అందజేసే పింఛన్ మొత్తాన్ని నెలనెలా ద ర్జాగా దక్కించుకుంటున్నారు. అనర్హులని తెలిసినప్పటికీ అధికారులు ప్రతినెలా ఒకటో తేదీన నేతల ఇళ్లవద్దకే వెళ్లి మరీ పింఛన్ అందజేస్తూ స్వామిభక్తి చాటుకుంటున్నారు.
జన్మభూమి కమిటీల ఘనకార్యమే
2014 లో టీడీపీ అధికారం చేపట్టిన అనంతరం వృద్ధులకు పింఛన్ మొత్తం రూ.1000, వికలాంగత్వ శాతాన్ని బట్టి రూ.1500గా నిర్ధారించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అధికారులకు కాకుండా జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే లబ్ధిపొందుతున్నారు. దీంతో 2014 ఆగస్టు నుంచి మండలంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జన్మభూమి కమిటీ సభ్యులు మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధుల భర్తలు పింఛన్‌దారులు అయ్యారు. బ్రహ్మసముద్రం మండలంలో 4,673 మంది వివిధ రకాల పింఛన్‌దారులున్నారు. వీరందరికీ ప్రతి నెలా రూ.50.28 లక్షలు పంపిణీ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులందరికీ ప్రభుత్వం నెలనెలా వేతనాలు అందజేస్తున్నా.. వారు మాత్రం పింఛన్లు పొందుతూ అభాగ్యుల పొట్ట కొడుతున్నారు.
పింఛన్ పొందుతున్న నేతల్లో కొందరు..
► భైరవానితిప్పకు చెందిన ఆంజనేయులు ఎంపీటీసీ సభ్యుడు. ఈయన సకలాంగుడైనప్పటికీ ఐడీ నంబర్ 112590047తో నెల నెలా వికలాంగుల కోటాలో పింఛన్ పొందుతున్నాడు.
► పడమటి కొడిపల్లికి చెందిన సర్పంచ్ బంగీకొట్టూరప్ప ఐడీ నంబర్ 112238285తో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు.
► మాజీ సర్పంచ్, జన్మభూమి కమిటీ సభ్యుడు అయిన లింగాయత్ బసన్న ఐడీ నంబర్ 112682097తో నెలనెలా ఇంటివద్దే పింఛన్ పొందుతున్నాడు.
► పడమటి కొండపల్లి ఎంపీటీసీ సభ్యురాలైన తిమ్మక్క ఐడీ నంబర్ 112239 263తో పింఛన్ పొందుతున్నారు. వీరితోపాటు, అధికార పార్టీకి చెందిన మరో సర్పంచ్‌తోపాటు మరో 10 మంది మాజీ సర్పంచులు, మహిళా ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా నెలనెలా పింఛన్ పంపిణీ అవుతోంది. రెండేళ్లుగా ఇదేతంతు జరుగుతోంది.